
అవే కష్టాలు..
జిల్లావ్యాప్తంగా అన్నదాతలకు ఇబ్బందులు
చిట్యాల/కాటారం/భూపాలపల్లి రూరల్: జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అన్నదాతల తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. చిట్యాల మండలకేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్దకు రైతులు శుక్రవారం తెల్లవారుజామున వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. గంటల కొద్ది నిల్చుని ఓపిక లేక చెప్పులు లైన్లలో పెట్టి కూర్చున్నారు. 260 బస్తాల యూరియాను పోలీస్ పహారా నడుమ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. బస్తాలు దొరకని రైతులు ఇదేం కష్టంరా నాయనా అంటూ ఆవేదనతో వెనుదిరిగారు.
కాటారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం, మన గ్రోమోర్ కేంద్రానికి శుక్రవారం యూరియా దిగుమతి కావడంతో ఉదయం నుంచే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యూరియా బస్తాల కోసం పంపిణీ కేంద్రాల వద్ద సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఒక్కో యూరియా బస్తా ఇవ్వగా మన గ్రోమోర్ వద్ద పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరగడం లేదని రైతులు ఆందోళన చేశారు.
లారీని అడ్డుకున్న గ్రామస్తులు
యూరియా బస్తాల లోడుతో భూపాలపల్లి మండలం పంబాపూర్ పీఏసీఎస్‌కు వెళ్తున్న లారీని మార్గమధ్యలో గొల్లబుద్దారం రైతులు యూరియా తమకు పంపిణీ చేయాలని గంటపాటు అడ్డుకున్నారు. వ్యవసాయాధికారులు మాట్లాడినప్పటికీ రైతులు పట్టించుకోలేదు. పోలీసులు చేరుకుని నిబంధనల ప్రకారం పంబాపూర్ పీఏసీఎస్‌కు తరలించారు.

అవే కష్టాలు..

అవే కష్టాలు..

అవే కష్టాలు..