
ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి
కాటారం(మహాముత్తారం): ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని.. పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మహాముత్తారం మండలంలో కేజీబీవీ భవనాన్ని ప్రారంభించి బోర్లగూడెంలో గ్రామపంచాయతీ భవనం, అంతర్గత రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యకు పెద్దపీఠ వేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించడం కోసం టీచర్ల నియామకం చేపట్టి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. ప్రతి విద్యార్థి ఇంగ్లిషు మీడియంలో చదివి ఉన్నత స్థానంలో నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పాఠశాలల్లో టీ పైబర్ ద్వారా ఏఐ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి ఆధునిక విద్యను పెంపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్‌శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, ఉపాధిహామీ పథకం రాష్ట్ర సభ్యుడు దండ్రు రమేశ్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రతి పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు