
రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుతల సమ్మయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అండర్–8, 10, 12 సంవత్సరాల వయస్సు కలిగి బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఉదయం 6.30గంటల వరకు జనన ధృవకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
రహదారులకు మరమ్మతు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారులకు శనివారం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తాత్కాలిక బస్టాండ్ నుంచి సరస్వతీ ఘాట్ వరకు, సరస్వతి ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారులు బురదమయంగా మారిపోయాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ అధికారులు హుటాహుటిన మరమ్మతు చర్యలకు పూనుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా స్టోన్ డస్ట్ వేసి రహదారులను బాగుచేశారు.
ర్యాంపులేక ఇబ్బందులు
చిట్యాల: కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వరస్వామి తూర్పు ద్వారం దగ్గర దివ్యాంగులకు అధికారులు ర్యాంపు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సరస్వతీ నది పుష్కర స్నానానికి అనేక మంది దివ్యాంగులు వస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ దివ్యాంగుడు తన కుటుంబసభ్యులతో కలిసి ఆలయ దర్శనానికి వచ్చారు. లోపలికి రాలేని స్థితి ఉండడంతో అతని కుటుంబసభ్యులతో పాటు సేవ కార్యకర్త అరెల్లి కిరణ్ వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి తూర్పు ద్వారం నుంచి ఆలయం లోపలికి ఎత్తుకెళ్లి దర్శనం చేయించారు. ఇప్పటికై నా అధికారులు దివ్యాంగుల కోసం ర్యాంపు ఏర్పాటుచేసి శ్రీముక్తీశ్వరస్వామి దర్శన భాగ్యం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు దివ్యాంగులు కోరుతున్నారు.
కోతుల దాడితో
చిన్నారికి గాయాలు
భూపాలపల్లి రూరల్: కోతులు దాడిచేయడంతో భూపాలపల్లి మండలం కొత్తపల్లి(ఎస్‌ఎం) గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన తరాల సురేష్ కుమారుడు మనివీత్ శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. కోతులు గుంపులుగా వచ్చి బాబు మీద ఒక్కసారిగా దాడిచేసి పొట్టపై గాయపరిచాయి. చుట్టు పక్కలవారు కర్రలతో కోతులను తరిమేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో పలుమార్లు గ్రామస్తులపై కోతులు దాడులు చేశాయని.. అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా స్పందించి కోతుల బాధ నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు