పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
కాటారం: కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా కొనసాగుతోంది. పుష్కరాల ప్రారంభం నుంచి జిల్లా పంచాయతీ విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం ఎంతో శ్రమించి పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15న పుష్కరాలు ప్రారంభం కాగా మొదటి రోజు నుంచి భక్తుల రాక మొదలైంది. దీంతో అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ముందస్తు ప్రణాళికతో తగు చర్యలు మొదలుపెట్టారు. ఆలయ పరిసరాలు, ప్రధాన సరస్వతీ ఘాట్, గోదావరి ఘాట్, టెంట్ సిటీ, ప్రధాన రహదారులు, ఇతరత్రా ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేశారు. భక్తులు పడేసిన చెత్త, పాలిథిన్ కవర్లు, ఇతరత్రా ఆహార పదార్థాలను పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఎండ, వాన లెక్కచేయకుండా పది రోజులుగా అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు భేష్‌గా నిలుస్తున్నాయి. వర్షంలో సైతం ఆలయ ఆవరణ, ప్రధాన ఘాట్‌ల వద్ద చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కృషి చేస్తున్నారు. మురుగునీరు నిలిచిన చోట, మరుగుదొడ్ల ఆవరణలో బ్లీచింగ్ చల్లి దుర్గంధం వెదజల్లకుండా చూస్తున్నారు. పుష్కరాల్లో ఎంతో ముఖ్యమైన పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పంచాయతీ అధికారులు సక్సెస్ అయినట్లు చెప్పుకోవచ్చు.
500 మంది ప్రత్యేక సిబ్బందితో..
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని భావించిన అధికారులు ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లారు. జిల్లాలోని 12 మండలాలకు చెందిన పంచాయతీ కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్స్‌తో పాటు అదనంగా ఇతర ప్రాంతాల నుంచి తా త్కాలిక పద్ధతిలో సిబ్బందిని నియమించుకున్నా రు. సుమారు 500 మంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ చెందిన డీపీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు సుమారు 150 మంది విధుల్లో ఉండి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
సేవలా భావిస్తున్నా
పుష్కరాల్లో పనులు చేయడం కోసం గుంటూరు నుంచి వచ్చాం. సరస్వతి ఘాట్ వద్ద చెత్తాచెదారం లేకుండా నిరంతరం శుభ్రపరుస్తున్నాం. ఇది కూడా ఒక సేవలా భావిస్తూ ఆలసట లేకుండా పారిశుద్ధ్య పనులు చేస్తున్నాం..
– దాసరి రోజా, తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది
కష్టమైనా ఇష్టంతో
పనిచేస్తున్నా..
పుష్కరాల్లో పారిశుద్ధ్య పనులు చేయడం ఆనందంగా ఉంది. కష్టమైనప్పటికీ ఇష్టంతో పని చేస్తున్నా. ప్రతి రోజు షిఫ్టుల వారీగా పని చేస్తున్నాం.
– అణెమ్మ, తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బంది
పది రోజులుగా పనిచేస్తున్నా..
పుష్కరాలకు ఒక రోజు ముందుగా కాళేశ్వరం చేరుకున్నాం. పది రోజులుగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నా. ఇక్కడకు వచ్చాక ఉపాధితో పాటు దైవసన్నిధిలో పనిచేసే అదృష్టం లభించింది.
– కుమారి, పారిశుద్ధ్య సిబ్బంది
పారిశుద్ధ్యం లోపించకుండా
తగు చర్యలు..
కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. ఆలయ పరిసరాలు, పుష్కర ఘాట్‌ల వద్ద పారిశుద్ధ్యం లోపించకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణతో ముందుకెళ్తూ పారిశుద్ధ్య పనులు పక్కాగా కొనసాగిస్తున్నాం.
– వీరభద్రయ్య, జిల్లా పంచాయతీ అధికారి
ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు
విధుల్లో 400మంది కార్మికులు, 150మంది అధికారులు
నిరంతరం చెత్త సేకరణ
నిరంతరం చెత్త సేకరణ
నిరంతరం చెత్త సేకరణ