భూభారతి.. సమస్యల హారతి | - | Sakshi
Sakshi News home page

భూభారతి.. సమస్యల హారతి

May 23 2025 2:11 AM | Updated on May 23 2025 2:11 AM

భూభార

భూభారతి.. సమస్యల హారతి

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను ఎంపిక చేసింది. తర్వాత జిల్లాకు ఒక మండలం చొప్పున ఎంపిక చేసి సదస్సులు నిర్వహించి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాలకు సంబంధించి.. నడికూడ (హనుమకొండ జిల్లా), వర్ధన్నపేట (వరంగల్‌), వెంకటాపురం (ములుగు), దంతాలపల్లి (మహబూబాబాద్‌), స్టేషన్‌ఘన్‌పూర్‌ (జనగామ), రేగొండ (జేఎస్‌ భూపాలపల్లి) మండలాలను ‘పైలట్‌’గా ఎంచుకున్నారు. ఆరు మండలాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. భూభారతి సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ, రక్షేత్రస్థాయి పరిశీలనలపై ‘‘గ్రౌండ్‌రిపోర్ట్‌’.

అధిక సంఖ్యలో అర్జీలు..

క్షేత్రస్థాయి పరిశీలన..

భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సదస్సుల్లో అర్జీలు అధికసంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి వరంగల్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈనెల 5 నుంచి 18 తేదీల వరకు సదస్సులు నిర్వహించారు. ఈ ఆరు మండలాల్లోని గ్రామాల నుంచి మొత్తం 19,655 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో ప్రధానంగా అర్జీదారులు సాదాబైనామా, అసైన్ట్‌, వారసత్వ మార్పిడిలను ఎక్కువగా అడిగారు. భూ విస్తీర్ణంలో తేడాలు, భూములు నిషేధిత జాబితాలోకి ఎక్కడం, భూ హద్దుల సమస్య, పేర్లు సరిచేయడం, సర్వే నంబర్ల మిస్సింగ్‌ తదితర సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా.. 19,655 అర్జీల్లో 8,339 సాదాబైనామా, 3,416 అసైన్డ్‌, 1,331 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడాల సవరణ కోసం 910 మంది అర్జీ పెట్టుకోగా.. మిగిలిన 5,659 దరఖాస్తులు వివిధ అంశాలపై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. పైలట్‌ మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో రైతులకు అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించి రసీదులు అందజేసిన అధికారులు, ఆ వివరాలను భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా ఆరు మండలాల్లో 21 ప్రత్యేక బృందాలను నియమించగా.. వారు దరఖాస్తుదారులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వేయర్‌, రెవెన్యూ బృందాలు భూములను పరిశీలించేందుకు వెళ్తున్నాయి. పాసుపుస్తకాల్లో రైతుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని గుర్తించి, వెంటనే సరిచేస్తారు. ఈ భూసమస్యలను రెవెన్యూ సెటిల్మెంట్‌ రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌)లలో సవరణ చేస్తారు. ఆరు మండలాల ఫీడ్‌ బ్యాక్‌తో జూన్‌ మొదటి వారంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్నారు.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా..

హనుమకొండ 2,898

వరంగల్‌ 3,197

జేఎస్‌ భూపాలపల్లి 7,111

జనగామ 1,068

ములుగు 4,555

మహబూబాబాద్‌ 826

ఆరు పైలట్‌ మండలాలనుంచి 19,655 దరఖాస్తులు

సదస్సుల ద్వారా అర్జీల స్వీకరణ..

సాదాబైనామాలకే ఎక్కువ ప్రాధాన్యం

ఆ తర్వాత అసైన్డ్‌, వారసత్వ మార్పిడిలు

ప్రధానంగా 12 అంశాలపై అర్జీలు

ఆన్‌లైన్‌ పోర్టల్‌కూ దరఖాస్తులు..

క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు

పైలట్‌ మండలాల పరిస్థితి..

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. మొత్తం 5,112 దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 30 శాతానికిపైగా సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు, రైతులు చెబుతున్నారు.

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 4,555 దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసినప్పటికీ తహసీల్దార్‌ కార్యాలయంలో పలువురు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు. వివాదాలు లేని సమస్యలను 40 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో సత్ఫలితాలు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు.

హనుమకొండ జిల్లా నడికూడలో రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 2,695 అర్జీలు రాగా, సదస్సులు ముగిశాక 203 అర్జీలు తహసీల్దారు కార్యాలయంలో రైతులు అర్జీలు పెట్టుకున్నారు. మొత్తం 2,898 అర్జీల్లో అత్యధికంగా 1,456 సాదాబైనామా, 481 అసైన్డ్‌ సవరణ, 331 డీఎస్‌ పెండింగ్‌, 223 వారసత్వ మార్పిడి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. భూవిస్తీర్ణంలో తేడా తదితర అంశాలపై అర్జీలు అందగా.. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూ గ్రామాల వారీగా నాలుగు బృందాలు పనిచేస్తున్నాయి.

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలో 3,197 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో 2,917 దరఖాస్తులు రాగా.. తహసీల్దార్‌ కార్యాలయంలో 280 దరఖాస్తులు రైతులు ఇచ్చారు. అత్యధికంగా 1,415 సాదాబైనామాలు రాగా.. ఆతర్వాత అసైన్డ్‌ భూములకు సంబంధించి 746 దరఖాస్తులు వచ్చాయి. వారసత్వ భూమార్పిడి కోసం ఏకంగా 192 దరఖాస్తులు వచ్చాయి. ఉన్న భూమి కంటే తక్కువ నమోదైనవారు 155 మంది ఉన్నారు.

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో సదస్సులు ముగిసినప్పటికీ దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. మొత్తం 1,068 దరఖాస్తులు వచ్చినట్లు అఽధికారులు చెబుతున్నారు. సాదాబైనామా మినహా మిగిలిన దరఖాస్తుల్లో 40శాతానికి పైగా.. సమస్యలు పరిష్కారమయ్యాయి. మొత్తంగా భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారంలో సత్ఫలితాలు వస్తున్నాయని అఽధికారులు, రైతులు చెబుతున్నారు.

భూభారతి.. సమస్యల హారతి1
1/1

భూభారతి.. సమస్యల హారతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement