జనగామ: జిల్లా ఆరోగ్య ప్రొఫైల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాలు, గత సర్వేతో పోలిస్తే జిల్లాలో మహిళా సాధికారత, మాతా, శిశు ఆరోగ్యం, టీకాలు, పోషకాహారం, డిజిటల్ వినియోగంలో గణనీయమైన పురోగతిని వెల్లడించాయి. అదే సమయంలో సిజేరియన్ ప్రసవాలు, ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, మద్యపానం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
పెద్దల్లో షుగర్.. బీపీ పెరుగుదల
పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతున్నా పెద్దల్లో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. అధిక బరువు, ఊబకాయం ఉన్న మహిళలు 24.1 నుంచి 38.7 శాతానికి పెరిగారు. అధిక షుగర్ ఉన్న మహిళలు 14.4 నుంచి 23.4 శాతానికి, పురుషులు 18.3 నుంచి 24.1శాతానికి పెరిగారు. అధిక బీపీ ఉన్న మహిళలు 26.1 నుంచి 28.9 శాతానికి, పురుషులు 29 నుంచి 31.5 శాతానికి చేరారు.
మహిళల్లో సాధికారత పెరుగుతోంది
91.6శాతం మహిళలు స్వయంగా ఉపయోగించే బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారు. సొంతంగా మొబైల్ ఉపయోగించే మహిళలు 57.7 నుంచి 64.8 శాతానికి పెరిగారు. 15–24 ఏళ్ల యువతుల్లో 98.5 శాతం మంది పరిశుభ్రమైన రుతుక్రమ పద్ధతులను పాటిస్తున్నారు.
పిల్లల సంఖ్య తగ్గింది.. వృద్ధుల వాటా పెరిగింది
ఐదేళ్లలోపు పిల్లల జనాభా 7 నుంచి 5.5 శాతానికి తగ్గగా, 15 ఏళ్లలోపు వారి వాటా 19.1 నుంచి 18 శాతానికి పడిపోయింది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారి వాటా 14.9 నుంచి 19.3 శాతానికి పెరిగింది. భవిష్యత్తులో వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం పెరగాల్సిన పరిస్థితిని ఇది సూచిస్తోంది.
ఇంటర్నెట్‌లో భారీ దూకుడు
మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 21.4 నుంచి ఏకంగా 64 శాతానికి చేరింది. పురుషుల్లో 47.1 నుంచి 91.9 శాతానికి పెరిగింది. పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదివిన మహిళలు 44 నుంచి 54.9 శాతానికి, పురుషులు 57.7 నుంచి 69.6 శాతానికి పెరిగారు.
టీకాల్లో ముందడుగు
12–23 నెలల పిల్లల్లో పూర్తి టీకాలు పొందిన వారి శాతం 84.2 నుంచి 93కి పెరిగింది. మీజిల్స్ తొలి డోసు 96.6 శాతం పిల్లలకు అందింది. విటమిన్ –ఏ పొందిన పిల్లల శాతం 80.8 నుంచి 94.2కి పెరిగింది.
బాల్య వివాహాలకు బ్రేక్
18 ఏళ్లలోపు వివాహమైన 20–24 ఏళ్ల మహిళల శాతం 20.3 నుంచి 13.9కి తగ్గింది. 15–19 ఏళ్లలో గర్భం దాల్చిన లేదా తల్లులైన యువతుల శాతం 6.5 నుంచి 5.2కి తగ్గింది. బాల్య వివాహాల నియంత్రణలో ఇది సానుకూల పరిణామం.
గర్భిణుల సంరక్షణలో భారీ పురోగతి
మొదటి మూడు నెలల్లోనే గర్భ నమోదు, పరీక్షలు చేయించుకున్న వారి శాతం 89.7 నుంచి 93.5కి చేరింది. కనీసం నాలుగు యాంటెనాటల్ చెకప్‌లు చేయించుకున్నవారు 65.4 నుంచి 84.6 శాతానికి పెరిగారు. 100 రోజుల ఐరన్ మాత్రల వినియోగం 59.4 నుంచి 85.1కి, 180 రోజుల వినియోగం 34.8 నుంచి 66.3 శాతానికి పెరిగింది.
ప్రసవాల్లో 100 శాతం సంస్థాగత సేవలు
జిల్లాలో ఆస్పత్రి ప్రసవాలు 99.6 నుంచి 100 శాతా నికి చేరాయి. ప్రభుత్వ ఆస్పత్రుల వాటా 49.6 నుంచి 68.6 శాతానికి పెరిగింది. మొత్తం ప్రసవాల్లో 70.2 శాతం సిజేరియన్లు కావడం ఆందోళన కలి గిస్తోంది. ప్రైవేట్‌లో 89.5 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 61.4 శాతం సిజేరియన్లు నమోదయ్యాయి.
పిల్లల పోషకాహారంలో మెరుగుదల
పుట్టిన గంటలోనే తల్లిపాలు అందించిన పిల్లలు 41.9 నుంచి 57.6 శాతానికి పెరిగారు. స్టంటింగ్ 33.4 నుంచి 29.2కి, వేస్టింగ్ 22.9 నుంచి 16.5కి తగ్గింది. అత్యంత తీవ్రమైన పోషకాహార లోపం 10.1 నుంచి 2.3 శాతానికి పడిపోవడం విశేషం. తక్కువ బరువున్న పిల్లలు 30.9 నుంచి 24 శాతానికి తగ్గారు.
పిల్లల ఆరోగ్యం మెరుగైంది
విరేచనాలతో బాధపడుతున్న పిల్లలు 10.8 నుంచి 8.5 శాతానికి తగ్గారు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌న్ లక్షణాలు ఉన్న పిల్లలు 2.7 నుంచి కేవలం 0.6 శాతానికి పడిపోయారు.
జిల్లా ఆరోగ్య ప్రొఫైల్‌లో కీలక అంశాలు
పెద్దల ఆరోగ్యానికి పెరుగుతున్న ముప్పు
తల్లీ, బిడ్డ ఆరోగ్యంలో ముందడుగు
బాల్య వివాహాలకు బ్రేక్,
మహిళా సాధికారతకు ఊతం
మద్యపానంపై ముప్పు,
జీవనశైలి వ్యాధుల్లో ఆందోళన
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడి
మద్యం.. మరో పెద్ద సవాలు
పురుషుల్లో పొగాకు వినియోగం 27.1 నుంచి 23.4 శాతానికి తగ్గింది. అయితే 15 ఏళ్లు దాటిన పురుషుల్లో 61.6 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో ఈ శాతం 9.0గా ఉంది. సర్వే ప్రకారం ఒక్కమాటలో చెప్పాలంటే, తల్లి–బిడ్డ ఆరోగ్యంలో జిల్లా ముందడుగులో ఉండగా, పెద్దల జీవనశైలి వ్యాధుల్లో వెనుకడుగులో ఉన్నట్లు వెల్లడించారు. మాతా, శిశు సంరక్షణ, టీకాలు, పోషకాహారం, డిజిటల్ అక్షరాస్యతలో సాధించిన పురోగతిని నిలబెట్టుకోవడంతో పాటు సిజేరియన్ల నియంత్రణ, షుగర్, బీపీ, ఊబకాయం, మద్యపాన నియంత్రణపై ఇక నుంచి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.


