జనగామ: జిల్లాలో విద్యా బోధనను మరింత బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ చేపట్టిన ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్‌మెంట్ పూర్తయింది. రెండు విడతల్లో 121 మందిని సర్దుబాటు చేయగా, 96 మంది ఎస్జీటీలను ఏకోపాధ్యాయ పాఠశాలలకు, 25 మంది స్కూల్ అసిస్టెంట్లను హైస్కూళ్లకు కేటాయించారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యాబోధనకు అంతరాయం లేకుండా జిల్లా విద్యాశాఖ చేపట్టిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియలో రెండో విడత సవరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉత్తర్వులు వెలువరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతోపాటు ఏకోపాధ్యాయ పాఠశాలలకు ప్రాధాన్యం ఇచ్చారు.
తొలి విడతలో 80 మంది
గత నెల 1వ తేదీన చేపట్టిన తొలి విడత సర్దుబాటులో జిల్లా వ్యాప్తంగా 80 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. వీరిలో 18 మంది స్కూల్ అసిస్టెంట్లు, 62 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నారు. అనంతరం సెప్టెంబర్‌లో పలువురు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయ డం, మండల విద్యాశాఖాధికారులు తాజాగా అందించిన వివరాల ఆధారంగా రెండో విడతలో కలెక్టర్ మార్పులు, చేర్పులు చేశారు. రెండో విడతలో 7గురు స్కూల్ అసిస్టెంట్లు, 34 మంది ఎస్జీటీలను సర్దుబాటు చేశారు.
96 సింగిల్ టీచర్ పాఠశాలలకు అదనపు బలం
రెండు విడతలను కలిపి మొత్తం 96 మంది ఎస్జీటీలను ఏకోపాధ్యాయ పాఠశాలలకు కేటాయించడం ఈ ప్రక్రియలో ప్రధానాంశంగా నిలిచింది. ఇప్పటి వరకు ఒక్క ఉపాధ్యాయుడితో కొనసాగుతున్న పాఠశాలలకు మరో ఉపాధ్యాయుడు అందుబాటులోకి రావడంతో బోధన, విద్యార్థుల పర్యవేక్షణలో కొంత వెసులుబాటు కలగనుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను విద్యార్థుల నమోదు ఆధారంగా సమతుల్యం చేయడంపై శాఖ దృష్టి సారించింది.
సబ్జెక్టు టీచర్ల కొరతకు పరిష్కారం
హైస్కూళ్లలో ప్రధాన సబ్జెక్టుల బోధనకు ఆటంకం లేకుండా 25 మంది స్కూల్ అసిస్టెంట్లను అవసరమున్న పాఠశాలలకు కేటాయించారు. గణితం, ఇంగ్లిష్, బయోలాజికల్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించేలా సర్దుబాటు చేపట్టారు.
పీజీఐ మెరుగుదలపై దృష్టి
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనను బలోపేతం చేయడం ద్వారా విద్యార్థులకు నిరంతర విద్యాబోధన అందించడంతో పాటు జిల్లా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) పనితీరు మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ వర్క్ అడ్జస్ట్‌మెంట్ పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టారు. సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులకు శాశ్వత బదిలీ, సీనియారిటీ వంటి హక్కులు వర్తించవు. వారు తమ అసలు పోస్టుల నుంచే వేతనాలు పొందుతారు.
సింగిల్ టీచర్ స్కూళ్లకు ప్రాధాన్యం
హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరతకు చెక్
96 ఏకోపాధ్యాయ బడులకు ఊరట
విద్యా ప్రమాణాలే లక్ష్యంగా
రెండు విడతల్లో 121 టీచర్ల సర్దుబాటు
అంశం తొలి రెండో రెండు
విడత విడత విడతల్లో
స్కూల్ అసిస్టెంట్లు 18 7 25
ఎస్జీటీలు 62 34 96
మొత్తం 80 41 121


