● రైతు శ్రీనివాస్‌ను అభినందించిన కలెక్టర్
లింగాలఘణపురం: ‘కూరగాయల సాగు చాలా బాగుంది..మార్కెటింగ్ ఎలా చేస్తున్నావు..ఎంత లాభం వస్తుంది..’ అని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మండలంలోని కళ్లెం గ్రామంలో కూరగాయలు పండిస్తున్న రైతు నకీర్త శ్రీనివాస్‌ను అభినందించారు. శుక్రవారం శ్రీనివాస్ పండిస్తున్న కూరగాయల పంట క్షేత్రాన్ని డీఏఓ, ఇన్‌చార్జ్ జిల్లా హార్టికల్చర్ అధికారి అంబికాసోనీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సోరకాయ, బీరకాయ, కీరదోస, చిక్కుడు కాయగూరల సాగును కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నావా..? ఎరువులు వాడుతున్నావా అని ప్రశ్నించగా రెండు కలిపి చేస్తున్నానని, మార్కెటింగ్‌లో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో ఆశించిన లాభాలు రావడంలేదని రైతు చెప్పారు. కాగా, వరి సాగుతో పోల్చితే కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు నీటి వినియోగంలో ఉన్న వ్యత్యాసాలను నివేదిక సిద్ధం చేయాలని డీఏఓ, ఇతర అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే రైతు శ్రీనివాస్ సాగు విధానంపై కేస్ స్టడీ తయారు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఏఓ నజీరుద్ధీన్, సర్పంచ్ శోభచంద్రమౌళి, ఏఈఓ ప్రత్యూష, రైతులు ఉన్నారు.


