రహదారిపై అడ్డంగా ఉన్న వానరాల గుంపు
జనగామ: అడవుల్లో ఆహారం, నీటి కొరతతో కోతులు గ్రామాల్లోనే తిష్టవేస్తున్నాయి. పాత, కొత్త గ్యాంగులుగా విడిపోయిన వానరాలు పంచాయతీలు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న ఉద్దేశంతో కోతుల గుంపులు ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడం.. రక్తికట్టే విధంగా పొట్లాడుకునే ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
పాత, కొత్త గ్యాంగుల హల్‌చల్
గత ఐదేళ్లుగా జనావాసాల్లో తిష్టవేసిన పాత కోతుల గుంపులు ‘ఇది మా ప్రాంతం.. ఇది మా ఆహారంం’ అన్నట్టు వ్యవహరిస్తూ ఊర్లలో తిరుగుతున్నాయి. ఇదే సమయంలో అటవీ ప్రాంతాల్లో ఆహారం దొరక్క బాధపడుతున్న కొత్త కోతులు గ్రామాలకు చేరి పాత అడ్డాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. పాత గుంపులు కొత్తగా వచ్చిన కోతులను చూసిన వెంటనే ‘ఎవర్రా మా సరిహద్దు దాటేది?’ అన్నట్టు గర్జిస్తూ దాడులు చేస్తున్నాయి. రెండు గుంపుల మధ్య జరిగే పోరాటాలు గ్రామాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఇవి ఏకంగా గ్యాంగ్ వార్స్ లా మారిపోవడంతో పల్లెల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇంటి బయట అల్పాహారం తింటున్నా, చేతిలో కవర్ పట్టుకుని నడుస్తున్నా కోతుల దాడి తప్పదన్న భయం ప్రజలను వెంటాడుతోంది. పాత, కొత్త కోతుల మధ్య గొడవల సమయంలో సమీపంలో ఎవరినైనా ఉన్నా.. వాటిని అదిలించే ప్రయత్నం చేసినా వాటి దాడిలో బలికావాల్సిందే.. అలా కోతుల దాడితో ఇప్పటికే పలువురు ఆస్పత్రిపాలయ్యారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయ రంగంపై
తీవ్ర ప్రభావం
ప్రజలకే కాకుండా.. వ్యవసాయ రంగానికీ ఈ కోతుల గ్యాంగ్ వార్స్ నష్టం కలిగిస్తున్నాయి. ముష్టి యుద్ధాల తర్వాత ఆకలితో అల్లాడే ఈ కోతులు పంటలపై దాడులు చేసి మొక్కజొన్న, పల్లీలు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు, పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి. కోతుల అడ్డా సమీపంలో ఉన్న పొలాల్లో రైతులు పంటలు వేయాలనే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఈ కోతుల పంచాయతీలు బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల, రఘునాథపల్లి, నర్మెట, లింగాలగణపురం, జనగామ అర్బన్, జఫర్‌గఢ్, చిల్పూరు, తదితర మండలాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతీ ప్రాంతంలో తమదైన అడ్డా నిర్మించుకున్న కోతులు ఒక గుంపుపై మరో గుంపు దాడులు చేస్తూ నిత్యం జనాన్ని భయకంపితులను చేస్తున్నాయి.
తలనొప్పిగా మారిన
కొత్తకోతుల రాక
పాత కోతుల వేధింపులతోనే అలసిపోయిన ప్రజలకు ఇప్పుడు కొత్త కోతుల రాక మరో తలనొప్పిగా మారింది. పాత, కొత్త కోతుల యుద్ధం ఎటు దారితీస్తుందోననే భయాందోళన ప్రజల్లో పెరుగుతోంది. ఇప్పుడైనా స్థానిక సంస్థలు, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్పంచులు, పురపాలక మండళ్ల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుని కోతుల నిర్మూలనపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కోతుల మధ్య కొత్త, పాత లొల్లి
గుంపులుగా దాడులు చేసుకుంటున్న కోతులు
ఇళ్లు, పంట పొలాలు, రహదార్లు.. ఎక్కడ చూసినా అవే..
బెంబేలెత్తుతున్న ప్రజలు
గ్రామాలు, పట్టణాల్లో పెరిగిన వానరాల గుంపులు


