లింగాలఘణపురం: మండలంలోని మాణిక్యాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతు ఏనెబావికి చెందిన పొన్నం తిరుమలేశ్ ఆదివారం ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలేశ్ నెల రోజుల క్రితం తాను సాగు చేసిన ఎనిమిది ఎకరాల దిగుబడి ధాన్యాన్ని మాణిక్యాపురం ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. నెల రోజులుగా ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేస్తున్నారు. కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని లారీల్లో సకాలంలో తరలించకపోవడంతో రైతులే స్వంతంగా ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలేశ్‌కు ట్రాక్టర్ లేకపోవడంతో నిర్వాహుకులు మరో రైతు ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు తిరుమలేశ్ ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. గమనించిన రైతులు అడ్డుకుని సముదాయించారు. దీంతో ఐకేపీ కేంద్ర నిర్వాహుకులు వెంటనే స్పందించి ఆయన ధాన్యాన్ని తూకం వేశారు. 92 క్వింటాళ్లు వెంటనే తూకం వేసి తగిన రశీదులను అందజేశారు.


