జనగామ: హిందూ ధర్మపరిరక్షణే సమాజ బలం అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు సాయిరాం కన్వెన్షన్ హాల్లో శనివారం రాత్రి హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళనం వైభవంగా జరిగింది. ఈ మహాసభకు సిద్ధాశ్రమ చేజర్ల మఠ పీఠాధిపతి, రాష్ట్ర సాధు పరివార అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామీజీ మహారాజ్, అఖిల భారత సమరసత కళావిభాగం కన్వీనర్ అప్పల ప్రసాద్ జీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మహారాజ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి భక్తుడి కర్తవ్యమని, ధర్మాన్ని నిలబెట్టే మార్గంలో సమాజం ఐక్యత చూపాలన్నారు. అప్పల ప్రసాద్ జీ మాట్లాడుతూ.. సమరసత, సామరస్యంతోనే హిందూ సమాజం మరింత బలపడుతుందన్నారు. కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ సోలంకి రవళి పాటిల్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహ కార్యవాహ్ దొంతుల శేఖర్, గౌరవ అధ్యక్షుడు ఫకీర్ యాదగిరిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెలిదె శ్రీధర్ పాల్గొన్నారు.
హిందూ ధర్మ సమ్మేళనంలో వక్తలు


