లీటరు పెట్రోలు,డీజిల్ ధరలు(రూ.ల్లో)
పెరిగిన ఇంధన ధరలు
జనగామ: జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతోంది. రవాణా రంగం, ప్రైవేటు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వాహనదారులు ఇలా ప్రతీ ఒక్కరిపై అదనపు భారం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 94 పెట్రోల్ బంకులు ఉండగా, రోజువారీగా సుమారు లక్ష లీటర్ల పెట్రోల్, 2 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1.45లక్షల వరకు ఉన్నాయి.
మోయలేని భారం
ఇంధన ధరల్లో తాజాగా పెరిగిన పెంపు ప్రజలపై భారం తప్పడం లేదు. లీటరు పెట్రోల్ గతంలో రూ. 107.41ఉండగా ప్రస్తుతం రూ.3.39 పెరిగి రూ.110.80కు చేరింది. అదే విధంగా డీజిల్ ధర లీటరుకు రూ.95.64 నుంచి రూ.3.26 పెరిగి రూ.98.90 కు పెరిగింది. ఈ పెంపు కారణంగా రోజువారీగా పెట్రోల్‌పై రూ.3.40 లక్షలు, డీజిల్‌పై రూ.6.52 లక్షలు, మొత్తంగా రూ.9.91 లక్షల వరకు అదనపు భారం వినియోగదారులపై పడుతున్నట్లు అంచనా.
1.45లక్షల వాహనాలు
జిల్లాలో గూడ్స్ వాహనాలు, బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు ఇతర ప్రైవేటు వాహనాలు కలిపి 1.45 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలే ఎక్కువ. పెట్రోల్ ధరల పెంపు కారణంగా వారి రోజువారీ జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. అదే విధంగా గూడ్స్ వాహనాలు, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై డీజిల్ ధరల పెంపు నేరుగా ప్రభావం చూపుతోంది. సరుకు రవాణా ఖర్చు పెరగడంతో భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరుగుతూనే ఉంటే చిన్న వాహనదారులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, కార్యకలాపాలను కొనసాగించడం కష్టమవుతుందని చెప్పారు. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా పెరుగుతున్న ఖర్చులతో వారి జీవనాధారంపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంధనం పాత కొత పెరిగిన ధర
పెట్రోల్ 107.41 110.80 3.39
డీజిల్ 95.64 98.90 3.26
రవాణా, వాణిజ్య రంగాలపై
తీవ్ర ప్రభావం
నిత్యావసర సరుకుల పెరుగుదల..
సామాన్యుడికి ఇక్కట్లు
జిల్లాలో రోజుకు రూ.10లక్షల
అదనపు భారం
రోజుకు 3 లక్షల లీటర్ల పెట్రోల్,
డీజిల్ అమ్మకాలు


