జనగామ: జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, నిర్మాణ ప్రగతిని వేగవంతం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం హైదరాబాద్‌లో వినతి చేశారు. ఎల్–2 అర్హత జాబితాలో ఉన్న అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అప్పగించడంతో పాటు ఇంకా మిగిలిన ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 52,408 ప్రజలు ఉండగా, 1,371 మంది ఎల్–2 స్కీమ్‌కు అర్హులుగా గుర్తించారన్నారు. వీరిలో ఎమ్మెల్యే కోటాలో కేటాయించిన 200 ఇళ్లలో 188 ఇళ్లు ఇప్పటికే శాంక్షన్ చేసి, లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. మిగిలిన 12 మంది అర్హులకు కూడా సత్వరమే ఇళ్లు మంజూరు చేసి అప్పగించాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో బచ్చన్నపేట, జనగామ మండలం, నర్మెట, తరిగొప్పుల, జనగామ టౌన్ కలిపి 800 ఇళ్లు కేటాయించబడగా, ఇప్పటికే 577 ఇళ్లు మంజూరు చేశారన్నారు. నిర్మాణం పూర్తితో పాటు కొనసాగుతున్న గృహాలు 511 కాగా, వివిధ కారణాలతో 61 ఇళ్లు రద్దు అయినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు స్పష్టం చేశారు. ఇంకా 223 ఇళ్లను ఆమోదించి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా అభ్యర్థించారు.
మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా విజ్ఞప్తి


