పక్కాగా మస్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పక్కాగా మస్టర్‌

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

ఉపాధి కూలీలకు ‘ఫొటో క్యాప్చరింగ్‌’ అటెండెన్స్‌

ఫొటోతో

హాజరు..

మరింత పారదర్శకత, భద్రతతో కూడిన నమోదు

వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి ఇక చెక్‌

జిల్లాలోని 1.14 లక్షల యాక్టివ్‌ కూలీలకు ప్రయోజనం

జనగామ: ఉపాధి హామీ పథకం(వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గర్‌ అండ్‌ అజీవక మిషన్‌(గ్రామీణ్‌)– వీబీ జీ రామ్‌ జీ)లో కూలీల హాజరును మరింత పారదర్శకంగా, భద్రతతో కూడిన విధంగా నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం(ఎన్‌ఎంఎంఎస్‌) గత నెల 30 నుంచి జిల్లాలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీనికి ముందు 15 రోజుల పాటు ట్రయల్‌ రన్‌ నిర్వహించి సాంకేతిక ఇబ్బందులను గుర్తించి పరిష్కరించారు. ఎన్‌ఎంఎంఎస్‌ అమల్లోకి రావడంతో కాగితపు మస్టర్ల ఆధారిత హాజరు పద్ధతికి స్వస్తి పలుకగా, మొబైల్‌ ఆధారిత ఫేస్‌ క్యాప్చరింగ్‌ విధానం తప్పనిసరి అయింది. ఉపాధి కూలీల హాజరు నమోదు, పరిశీలన, ఆమోద ప్రక్రియలో వేగం పెరగడంతో పాటు, వేతన చెల్లింపుల్లో ఆలస్యానికి చెక్‌ పెట్టనున్నారు.

ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం

కూలీల వ్యక్తిగత వివరాలు, జాబ్‌ కార్డు సమాచారం, హాజరు ఫొటోలు నేరుగా ఆధార్‌ ఆధారిత ఈ–కేవైసీతో అనుసంధానం చేయబడతాయి. ఫొటో తీసిన తర్వాత సమాచారం సర్వర్‌కు అప్‌లోడ్‌ అవుతుంది. దీని ద్వారా హాజరు నమోదులో తప్పిదాలు, ఇతరుల పేర్లపై నమోదు వంటి సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పడనుంది.

రోజుకు రెండుసార్లు

కూలీల హాజరును రోజుకు రెండుసార్లు నమోదు చేయాలి. మొదటి ఫొటో పని ప్రదేశానికి చేరుకున్న వెంటనే, రెండో ఫొటో నాలుగు గంటల తర్వాత మాత్రమే క్యాప్చర్‌ అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఈ రెండో ఫొటో తీసే సమయంలో నాలుగు గంటలు పూర్తి కాకపోతే యాప్‌ దానిని తీసుకోదు. దీని వల్ల కూలీ వాస్తవంగా పని ప్రదేశంలో ఉన్నాడా లేదా అన్నది నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. అదేవిధంగా రెండో ఫొటోను గ్రూప్‌గా తీయవచ్చు. పది మంది కూలీలను ఒకే ఫొటోలో నిలబెట్టి తీసుకోవచ్చు.

సాంకేతిక సమస్యలైతే..

ఫేస్‌ క్యాప్చరింగ్‌ సమయంలో యాప్‌ పనిచేయకపోవడం, నెట్‌ సిగ్నల్‌ సమస్యలు రావడం, కూలీ ముఖం గుర్తుపట్టకపోవడం వంటి సాంకేతిక ఇబ్బందులు వచ్చినప్పుడు ‘జెన్‌న్‌నరేగా’ యాప్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. ఈ విధానం కారణంగా హాజరు శాతంలో చిన్నపాటి లోపాలను సైతం అధిగమించే అవకాశం ఉంటుంది.

నెట్‌వర్క్‌ సమస్యలు అధిగమించేలా..

గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్‌ సమస్యలు ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ముఖ్య సూచనలు జారీ చేశారు. సిగ్నల్‌ లేక ఫొటో అప్‌లోడ్‌ కాని సమయంలో ఇంటికి వెళ్లి లేదా సిగ్నల్‌ లభించే ప్రాంతంలో తర్వాత అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

50 మందికి పైగా కూలీలు ఉన్నచోట..

పని ప్రదేశంలో 50 మందికి పైగా కూలీలు ఉన్నచోట ఒక కూలీని ప్రత్యేకంగా ఫొటోలు తీసే బాధ్యత కోసం ఎంపిక చేసుకోవచ్చు. అతడికి ఆ రోజు వేతనం పూర్తిగా చెల్లిస్తారు. దీనివల్ల పని ఆగకుండా, ఒకరు ఫొటోలను తీసుకుంటూ, మిగతా కూలీలు పనిని కొనసాగించవచ్చు.

జిల్లాలో ఉపాధి హామీ సమాచారం

1.16లక్షల జాబ్‌ కార్డులు

జిల్లాలో 1.16లక్షల జాబ్‌కార్డులు ఉండగా, ఇందులో 2.24 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరిలో 76,727 జాబ్‌ కార్డులు యాక్టివ్‌గా ఉండగా, 1.14లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 7న ఒక్కరోజే 6,511 కూలీలు పనికి హాజరయ్యారు. ఫేస్‌ క్యాప్చరింగ్‌ విధానం విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో రోజువారీ హాజరు 99 శాతానికి పైగా ఫేస్‌ క్యాప్చరింగ్‌ హాజరు నమోదవుతోంది. కొన్ని గ్రామాల్లో సిగ్నల్‌ సమస్యలు ఉన్నా, ప్రత్యామ్నాయ చర్యల వల్ల హాజరు నమోదు లోపాలు లేకుండా కొనసాగుతోంది. ఉపాధి కూలీల అసలు హాజరు, వాస్తవ పనిని నిర్ధారించే అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా ఎన్‌ఎంఎంఎస్‌ నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement