జనగామ: అంగన్‌వాడీ సేవల ఆధునికీకరణలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రీ–స్కూల్ విద్య, గర్భిణులు, శిశుపోషణ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అంగన్‌వాడీ టీచర్లకు సరికొత్త స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సేవల నాణ్యతను పెంచడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ డిజిటల్ సేవలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, కొడకండ్ల మూడు క్లస్టర్ల పరిధిలో 695 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 666 మంది టీచర్లు పని చేస్తున్నారు. 2,156 గర్భిణులు, 1,666 బాలింతలు, ఆరు నెలల ను ంచి మూడేళ్ల లోపు చిన్నారులు 10,906, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 10,364 మంది ఉన్నారు. 692 మంది అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేశారు.
సేవలన్నీ ఫోన్ ద్వారానే
స్మార్ట్‌ఫోన్ అందుకున్న వెంటనే అంగన్‌వాడీ టీచర్లు రోజువారీ కార్యకలాపాలను యాప్‌ల ద్వారా నమోదు చేయడం ప్రారంభించారు. పిల్లల హాజరు, పోషకాహార పంపిణీ, గర్భిణుల ఆరోగ్య పరిశీలన వంటి సమాచారాన్ని ఇకపై క్షణాల్లోనే ప్రభుత్వం డేటాబేస్‌కు పంపిస్తారు. దీనివల్ల డేటా నమోదు లోపాలు తగ్గడంతో పాటు మరింత పారదర్శకత పెరుగుతుంది.
విధుల్లో వేగం..
గతంలో రికార్డుల్లో రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక ఫొటో, ఒక క్లిక్‌తోనే రిపోర్ట్ పంపగలిగే అవకాశం కలుగుతుంది. స్మార్ట్ ఫోన్‌తో పిల్లల అభ్యాసానికి సంబంధించిన చిన్న వీడియోలు, పాటలు, కథలు చూపుతూ బోధన పద్ధతి కూడా మరింత ఆకర్షణీయంగా మారనుంది. అంతేకాకుండా ఫీల్డ్ స్థాయి పరిశీలనను వేగవంతం చేయడంతో పాటు, తల్లులు, బిడ్డల ఆరోగ్య సూచనలు కూడా వాట్సప్ గ్రూపుల ద్వారా త్వరితగతిన చేరుతాయి. అత్యవసర సందర్భాల్లో అధికారులను సత్వరమే సంప్రదించే వెసులుబాటు కలుగుతుంది. డిజిటల్ పరికరాల ద్వారా అంగన్‌వాడీ వ్యవస్థను పారదర్శకంగా మార్చడమే ప్రభుత్వ అసలు ఉద్దేశం. గ్రామీణ శిశు పోషణ, ప్రాథమిక విద్య రంగాల్లో ఇది ఒక పెద్ద మార్పునకు నాందిగా భావిస్తున్నారు.
అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
గర్భిణులు, శిశుపోషణ సేవల్లో వినూత్న అడుగు
యాప్ ద్వారా రోజువారీ కార్యకలపాలు
జిల్లాకు 692 ఫోన్లు అందజేత


