జనగామ: అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని సాయినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తల్లుల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి వివరించారు. అనంతరం గర్భిణులు, మహిళలకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ అనురాధ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ బి.పూర్ణిమ పాల్గొన్నారు.
మత్తుమందుల
దుర్వినియోగంపై అవగాహన
జనగామ: డ్రగ్స్ దుర్వినియోగంపై యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ షేహనవాజ్ ఖాసీం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే నిర్వహించారు. బుధవారం జనగామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలల్లో జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ ఆధ్వర్యంలో డ్రగ్ అబ్యూస్ అండ్ మిస్‌యూస్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ (అలవాటు, మత్తు కలిగించే మందుల దుర్వినియోగం, ప్రభావాలు, పరిణామాలు) అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి పోటీల్లో ఈ నెల 11న కలెక్టరేట్ సమావేశం హాల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని బాలకృష్ణ తెలిపారు.
15న వల్మిడి
హుండీ లెక్కింపు
పాలకుర్తి టౌన్: మండలంలోని వల్మిడి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 15న బుధవారం ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో దేవాలయంలో హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రేషన్ బియ్యం
క్రయవిక్రయాలు జరపొద్దు
దేవరుప్పుల: ప్రభుత్వం నిరుపేదలకు అందించే రేషన్ బియ్యం క్రయవిక్రయాలు ఎవరూ జరిపినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని డీటీసీఎస్ ఎన్ లచ్చునాయక్ హెచ్చరించారు. బుధవారం రాత్రి మండలంలోని ధారావత్‌తండాలో ధారావత్ రాజేశ్ అనే వ్యక్తి ఇదే తండాలో భూక్య రాములు ఇంట్లో పోలీసులతో కలిసి అక్రమంగా నిల్వచేసిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని స్థానిక డీలర్ కునుసోతు లక్ష్మికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ బియ్యం కార్డు లబ్ధిదారులు డీలర్ వద్ద తీసుకున్న బియ్యం అమ్మినట్టు నిర్ధారణయితే సదరు కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. డీటీసీఎస్ ఇట్టబోయిన శ్రీనివాస్, ఎస్సై ఊర సృజన్‌కుమార్, పోలీసు సిబ్బంది యాకేష్, ప్రవీణ్ ఉన్నారు.
స్వయం ఉపాధి పథకానికి
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రివైజ్డ్ ఎస్సీ వార్షిక ప్రణాళిక 2025–26 గాను జిల్లాకు 260 యూనిట్లు కేటాయించినట్లు, సబ్సిడీ 361.82 లక్షలు లక్ష్యంగా షెడ్యూల్డ్ విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆఖరి తేదీ ఈనెల 16వరకు పొడిగించినట్లు తెలిపారు. తుది ఎంపిక కలెక్టర్ అధ్యక్షతన నియమించబడిన జిల్లా కమిటీ ద్వారా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదంతో జరుగనుంది.


