కాశగూడెంలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కాశగూడెంలో ఉద్రిక్తత

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని పాంనూర్‌ గ్రామ శివారు కాశగూడెంలో సర్వేనంబర్‌ 194లో పలువురు అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లు, గుడిసెలను తొలగించేందుకు బుధవారం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్‌ స్వప్న ఆధ్వర్యంలో ఆర్‌ఐలు సతీష్‌, శ్రీకాంత్‌, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌, పోలీసు సిబ్బందితో కాశగూడెం చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బాధితులు ఇమామ్‌బీ, ఎండీ షఫీర్‌, జైన్‌బీ, షేక్‌ లకూమ్‌, ఇమామ్‌బీ, ఖాసీమ్‌ తదితరులు అడ్డుకున్నారు. తాము బండ కొట్టుకుంటూ రాళ్లు అమ్ముకుని జీవనం సాగించే నిరుపేదలమని, చాలా ఏళ్లుగా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామన్నారు. హుటాహుటిన వచ్చి తమ ఇళ్లను, గుడిసెలను తొలగిస్తామంటే సహించేది లేదంటూ రెవెన్యూ, పోలీసు అధికారులతో వాగ్వాదం చేశారు. సాయంత్రం వరకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా పొక్లెయినర్‌తో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా ఇమామ్‌బీ అనే మహిళ పొక్లెయినర్‌కు అడ్డునిల్చుని తీవ్రంగా ప్రతిఘటించింది.

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న వ్యక్తి

ప్రభుత్వ భూమిలో అక్రమంగా బాత్‌రూమ్‌ నిర్మాణం చేసుకున్నాడని దానిని కూల్చివేసేందుకు అధికారులు, పోలీసు సిబ్బంది యత్నించగా ఆ ఇంటి యజమాని అయిన షఫిర్‌ వారిని అడ్డుకున్నారు. తమ బాత్‌రూమ్‌ను ధ్వంసం చేయవద్దని, చేస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్నాడు. కాగా పక్కనే ఉన్న వ్యక్తులు అతడి చేతిలో నుంచి సీసాను లాగేసి పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులకు, నిర్మాణాలు చేసుకున్న బాధితులకు వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అక్రమ నిర్మాణాలు వద్దుఽ: స్వప్న, తహసీల్దార్‌

ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే సహించేది లేదు. ఇష్టారాజ్యంగా వందల గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. మూడు రోజులు గడువు ఇస్తున్నాం. ఆలోగా అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించాలి. లేని యెడల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలను

తొలగించేందుకు అధికారుల యత్నం

అడ్డుకున్న బాధితులు..

అధికారులతో వాగ్వాదం

స్వచ్ఛందంగా తొలగించుకునేందుకు మూడు రోజుల సమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement