జనగామ: తెలంగాణ రాష్ట్ర ఆహార పరిరక్షణ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం నేడు(సోమవారం) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు ఆహార భద్రత అధికారి సీహెచ్.వినీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం రూమ్ నెంబర్ జీ2లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఆహార వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్లు పొందడం లేదా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఆహార భద్రత అధికారి:7306335795, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ :9985820544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
గేట్‌లో మెరిసిన ఆకాంక్ష
● జాతీయ స్థాయిలో 542వ ర్యాంక్
బచ్చన్నపేట: మండలంలోని చిన్నరామన్‌చర్ల శివారు గ్రామమైన మొండికుంటకు చెందిన పుర్మ ఆకాంక్ష ఇటీవల వెలువడిన గేట్ 2026 ఫలితాల్లో ఆల్ ఇండియా 542వ ర్యాంక్ సాధించింది. పాఠశాల, కళాశాల విద్యలోనూ ఆకాంక్ష అద్భుత ప్రతిభ చూపించింది. 2023లో ఈసెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆమె తల్లిదండ్రులు పుర్మ లలిత, రాంరెడ్డిలది సాధారణ రైతు కుటుంబం. కాగా, గేట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన ఆకాంక్షను గ్రామస్తులు అభినందించారు.
జిల్లా మహాసభకు ఎమ్మెల్సీ విజయశాంతికి ఆహ్వానం
రఘునాథపల్లి: ఈ నెల 7న జిల్లా కేంద్రంలో 14 కార్మిక సంఘాలతో కలిసి టీబీఎస్‌ఆర్‌కేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా మహాసభకు ఆదివారం ఎమ్మెల్సీ విజయశాంతిని సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. తమ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో టీబీఎస్‌ఆర్‌కేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గిన్నారపు మహేంద్ర, రాసమల్ల కొమురయ్య, నల్ల సామన్న, తూడి అంజయ్య, గిన్నారపు రవి తదితరులు ఉన్నారు.
సంకటహరచతుర్థి పూజలు
హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సాయంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహాహారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
ముగిసిన టెన్నిస్ ఇంటర్ క్లబ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు రవిచంద్ర, సుదర్శన్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.


