పారదర్శకంగా ‘సర్‌’ ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ‘సర్‌’ ప్రక్రియ

Mar 26 2026 7:51 AM | Updated on Mar 26 2026 7:51 AM

ఎస్సీ కార్పొరేషన్‌ స్వయం ఉపాధి పథకాలకు గడువు పెంపు

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సూచించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో తహసీల్దార్లకు, ట్రైనర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, తహసీల్దార్లు, ఎలక్షన్‌ డీటీ పాల్గొన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి..

పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. బుధవారం పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకులాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టాఫ్‌ రూమ్‌ను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం శామీర్‌పేట్‌లోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమంలో విక్రమ్‌, హౌజింగ్‌ పీడీ మాతృ నాయక్‌ పాల్గొన్నారు.

అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి నిధులివ్వండి

అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

జనగామ: పట్టణంలోని అసంపూర్తి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సమస్యపై బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీలో గళం వినిపించారు. గతంలో నిర్మాణం ప్రారంభమైన ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న 800 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పూర్తి చేసేందుకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్లాబ్‌ దశలో నిలిచిపోయిన ఇళ్లను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌1, ఎల్‌3 జాబితాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉందని, ఎన్నికల ముందు ఇళ్ల పూర్తి కోసం ప్రక్రియ ప్రారంభమైనా మధ్యలోనే నిలిచిపోయిందన్నారు.

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

జనగామ రూరల్‌: లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ, న్యూఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్‌ ఆదేశాల మేరకు 28న(శనివారం) జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసులు లోక్‌ అదాలత్‌లో పరిష్కరించబడినట్లయితే, వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుం కూడా పార్టీలకు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు.

జనగామ: జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీపై అందిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్లకు భారీ స్పందన వచ్చిందని ఈడీ మాధవీ లత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఓబీఎంఎంఎస్‌ పోర్టల్‌ tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పొడిగించడం జరిగిం దన్నారు. ఇప్పటివరకు ఈబీ టూ వీలర్లకు 299, గైడ్స్‌ కోసం 145, ప్యాసింజర్‌ 407, సోలార్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్లు 33, మొత్తంగా 884 దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఆన్‌న్‌లైన్‌లో సమర్పించిన తమ అప్లికేషన్‌కు సంబంధించిన అవసరమైన పత్రాలను కలెక్టరేట్‌లోని ఎఫ్‌–25 రూం నంబర్‌లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఏప్రిల్‌ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు.

సిద్ధేశ్వరాలయ హుండీ ఆదాయం రూ.3.59లక్షలు

బచ్చన్నపేట: మండలంలోని కొడవటూర్‌ స్వయంభు శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 3,59,197లు వచ్చినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ తెలిపారు. బుధవారం హుండీ లెక్కింపు అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి 4 నుంచి మార్చి 24వరకు భక్తులు హుండీలో సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని ఆలయ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్‌ నిఖిల్‌ పర్యవేక్షణలో లెక్కించామన్నారు. ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి ఓం నమశివాయ, సర్పంచ్‌ నీల కవితమురళి, ఉప సర్పంచ్‌ గంగం దయాకర్‌ రెడ్డి, మాజీ డైరెక్టర్‌ నిమ్మ కరుణాకర్‌రెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది, మహబూబాబాద్‌ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement