భయంతోనే బారులు! | - | Sakshi
Sakshi News home page

భయంతోనే బారులు!

Mar 26 2026 7:51 AM | Updated on Mar 26 2026 7:51 AM

అవసరానికి మించి పెట్రోల్‌ కొనుగోళ్లు

కొరత లేదు..

అవసరానికి మించి పెట్రోల్‌ కొనుగోళ్లు

జనగామ: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు బంకుల్లో పెరుగుతున్న రద్దీతో వినియోగదారుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారత ఇంధన సరఫరాపై ప్రభావం చూపవచ్చనే వార్తలు బయటకు రావడంతో, సాధారణంగా రోజువారీ అవసరం మేరకు ఇంధనం నింపుకునే వాహనదారులు ఇప్పుడు ముందస్తు భయంతో అడ్వాన్స్‌గా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంతో పాటు వ్యక్తిగత వాహన యజమానులు కూడా అవసరానికి మించి పెట్రోల్‌ కొనుగోలు చేయడం వల్ల జిల్లాలోని పలు బంకుల్లో స్టాక్‌ తగ్గిపోయి, కొన్నిచోట్ల తాత్కాలికంగా బంకులు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

అదనంగా కొనుగోలు..

సాధారణంగా రోజుకు ఒకసారి మాత్రమే ఇంధనం తీసుకునే వినియోగదారులు ఇప్పుడు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా పెట్రోలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో బంకుల్లో ఉన్న రెగ్యులర్‌ స్టాక్‌ గంటల వ్యవధిలోనే కొనుగోలు పేరిట ఆవిరైపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇండియన్‌, భారత్‌, హెచ్‌పీ ఎస్‌ఆర్‌.. తదితర కంపెనీలకు చెందిన 97 బంకులు ఉన్నాయి. వీటిల్లో సాధారణంగా రోజువారీగా లక్ష లీటర్లకు పైగా పెట్రోల్‌ అమ్మకం జరుగుతుంది. అయితే ప్రస్తుతం డిమాండ్‌ 20 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు అధికారులు బంకు నిర్వాహకులు చెబుతున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు

జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని బంకుల్లో అధిక రద్దీ కనిపిస్తోంది. ఉదయం మొదలైన క్యూలైన్‌లు రాత్రి 10 నుంచి 11 గంటల వరకూ కొనసాగుతోంది. రద్దీ భయంతో మెజార్టీ కస్టమర్లు ముందస్తుగా పెట్రోలు నింపుకోవడానికి బంకుల వద్ద నిరీక్షిస్తున్నారు.

మండలాల వారీగా..

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో 11 పెట్రోల్‌ బంకులు ఉండగా, తాటికొండ, ఇప్పగూడెంలోని మూడు బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. బచ్చన్నపేట మండలంలో ఐదు పెట్రోల్‌ బంకుల్లో రెండింట్లో పెట్రోల్‌ క్లోజ్‌ అయింది. జఫర్‌గఢ్‌ మండలంలో మూడు బంకులకు గాను రెండు బంకుల పరిధిలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. నర్మెట మండలంలోని మూడు బంకుల్లో నిల్వలు క్లోజ్‌ కావడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. దేవరుప్పుల మండలంలో ఆరు బంకులకుగాను రెండింట్లో పెట్రోలు లేకపోవడంతో మూసివేశారు. పాలకుర్తి లో ఒకే ఒక్క బంకులో నోస్టాక్‌ ఉంది.

ఇంధన సరఫరాపై ప్రభావం పడొచ్చనే ఆందోళనే కారణం..

కొరత లేదు.. ఆందోళన వద్దు: ప్రభుత్వం

అడ్వాన్స్‌ కొనుగోళ్లతో కొరత: బంకుల యజమానులు

ఇంధన సరఫరాలో అంతరాయం లేదని చమురు కంపెనీలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అడ్వాన్స్‌ కొనుగోళ్లతో కొరత ఏర్పడిందే తప్ప, పెట్రోల్‌ కొరత లేదని ప్రభు త్వం, అధికారులు చెబుతున్నారు. అవసరానికి మించిన కొనుగోళ్లు చేయకుండా ప్రజలు సహకరిస్తే జిల్లా వ్యాప్తంగా పరిస్థితి యథాస్థితికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం బంకుల్లో కనిపిస్తున్న రద్దీ పూర్తిగా ప్రజల ఆందోళనతోనే పెరిగిందని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని సంబంధిత శాఖలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement