జనగామ: గ్రామైఖ్య సంఘాల ద్వారా బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాల పద్ధతిలో చెల్లించినా నోటీసులు తప్పడం లేదని జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన 30 గ్రూపులకు చెందిన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులతో బుధవారం పురపాలిక కార్యాలయ ఆవరణలో ఉన్న ఎస్‌బీఐకి వచ్చి మోసపోయిన విషయం అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు విలేకరులతో మాట్లాడారు.. సారూ.. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకులకు రుణం డబ్బులు చెల్లిస్తే.. బ్యాంకులో జమ చేయలేదని వాపోయారు. సాయిబాబా గ్రామైఖ్య సంఘంలో 36 గ్రూపులు ఉండగా, ఇందులో 30 గ్రూపులకు సంబంధించి రుణం రూ.86లక్షలు ఉండగా, 95శాతం మేర 2022 ఫిబ్రవరిలో క్లోజ్ చేసినట్లు చెప్పారు. సీఏ ద్వారా మినీ బ్యాంకు నిర్వాహకురాలు కలిసి తమ డబ్బులు బ్యాంకులో జమ చేయలేదన్నారు. దీంతో 2023లో రుణం డబ్బులు కట్టాలని బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో ఇద్దరి కుంభకోణం వెలుగు చూసిందన్నారు. అప్పటి ఉంచి నేటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామన్నారు. 2026 మార్చి చివరి అవకాశం నేపథ్యంలో రుణం డబ్బులు చెల్లించాలని మరోసారి నోటీసులు ఇచ్చారని గ్రామైఖ్య సంఘం కార్యదర్శి నూనెముంతల వనితతో పాటు వందలాదిగా వచ్చిన మహిళా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మినీ బ్యాంకులో డబ్బులు చెల్లించే సమమంలో తమకు ఇచ్చిన కౌంటర్ ఫైల్‌లో కనీసం స్టాంపు కూడా లేదని, దీనిపై విచారణ చేయాలని గత ఐదేళ్లుగా తిరుగుతున్నామన్నారు. కొత్త వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సైతం వినతి చేశామన్నారు. మహిళా సంఘాలను మోసం చేసి, తాము ఇచ్చిన డబ్బులను బ్యాంకులో జమ చేయకుండా పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆస్తులను అటాచ్ చేసి, తమకు ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని వేడుకున్నారు.
బ్యాంకు నుంచి నోటీసులు ఇస్తున్నారు..
2022 నుంచి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు..
వెంకిర్యాల మహిళా సంఘాల సభ్యుల
నిరసన


