● పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు..
ప్రారంభంకాని కొనుగోళ్లు
● కనీస మద్దతు ధర క్వింటా
రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950
● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా
3.43 లక్షల ఎకరాల్లో సాగు
● అసెంబ్లీలో ఈనెల 18న చర్చ..
మంత్రి ఆదేశించినా పురోగతి లేదు
● మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడద
ఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
సాక్షిప్రతినిధి, వరంగల్: కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్‌లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్‌ఫెడ్, ప్యాక్స్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్‌ఫెడ్ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో సిండికేట్‌గా మారిన కొందరు ప్రైవేట్ వ్యాపారులు మార్కెట్‌లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్‌పీతో పోలిస్తే క్వింటాలుకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు..
ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్‌ఫెడ్, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు.


