లింగాలఘణపురం: రాష్ట్రంలోని పేదలందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం దేశశంలోనే ఒక చరిత్ర అని, కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని రామచంద్రగూడెం, జీడికల్, గుమ్మడవెల్లి, పటేల్‌గూడెం గ్రామాల్లో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 50 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వారందరికీ ప్రభుత్వం బీమా కల్పిస్తూ బడ్జెట్ రూపొందించిందని అన్నారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మండలంలోని అన్నీ చెరువులను గోదావరి జలాలతో నింపుతున్నానని, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశానని అన్నారు. అంతకు ముందు రామచంద్రగూడెంలోని తాళ్లకుంటలో గోదావరి జలాలకు భూమిపూజ చేశారు. జీడికల్‌లో వీరాచల రామచంద్రునికి ప్రత్యేక పూజలు, గుమ్మడవెల్లిలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను, పటేల్‌గూడెంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. మార్కెట్ వైస్ చైర్మన్, పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్‌లు మల్లారెడ్డి, సుమలత, బుచ్చయ్య, రామకృష్ణ, దేవస్థాన చైర్మన్ మూర్తి, నాయకులు దిలీప్‌రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి


