వారెంత? మనమెంత?
పురపోరులో
‘మనీ మేనేజ్‌మెంటే’ కీలకం
జనగామ: జనగామ–స్టేషన్ ఘన్‌పూర్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నామినేషన్ల దశ పూర్తి కాగా, స్క్రూటినీ అనంతరం ఈ నెల 3వ తేదీన ఉపసంహరణ గడువు ఉండడంతో పార్టీల్లో చర్చలు, లెక్కలు, అంతర్గత రాజకీయం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఎవరెంత ఖర్చు చేస్తారు..ఎంత ఖర్చు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది..ప్రత్యర్థిపై నెగ్గాలంటే ఎంత ఖర్చుపెట్టాల్సి ఉంటుందనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే డమ్మీ అభ్యర్థులను ఉపసంహరించుకునే విధంగా పార్టీల నేతలు సీరియస్‌గా చర్చలు జరుపుతుండగా, అధికారిక అభ్యర్థులు మాత్రం ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మనీ మేనేజ్‌మెంట్..
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారానికి కావాల్సిన మనీ మేనేజ్‌మెంట్‌లో నిమగ్నమవడం చర్చనీయాంశంగా మారింది. రోజువారీ ప్రచారం, కార్యకర్తల ఖర్చులు, ఓటర్లకు పంచాల్సిన ప్యాకేజీలపై ముందుగానే లెక్కలు వేసుకుంటూ భారీ మొత్తంలో నిధులను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ సమీకరణాలకన్నా మనీ చుట్టూనే అంతా తిరుగుతోందని అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటికే పలు వార్డుల్లో ఇంటింటా పర్యటించారు. నామినేషన్లకు ముందే ఆయన ప్రారంభించిన ప్రత్యేక ప్రచారం ఇప్పుడు వేగం పుంజుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా ప్రచార రంగంలోకి దిగుతోంది. గత వారం రోజులు అభ్యర్థులు స్వతహాగా ప్రచారం ప్రారంభించగా, ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, జనగామ నియోజకవర్గ ఇన్‌న్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వార్డుల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
ఘన్‌పూర్‌లో గట్టి పోటీ..
ఇక స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ కుర్చీపై రెండు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోరు నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రతిరోజూ కార్యకర్తలతో చర్చలు కొనసాగిస్తూ అధికార పీఠాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇదే తరుణంలో అక్కడి మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, జనగాామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ కొత్తగా ఏర్పడిన స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రతీ వార్డుపై దృష్టిపెట్టి ప్రజలతో సమీపంగా మమేకమవుతున్నారు. పార్టీల అంతర్గత సమస్యల విషయానికి వస్తే, బీఆర్‌ఎస్‌లో వార్డుల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అయితే కాంగ్రెస్‌లో మాత్రం కొన్ని చోట్ల అభ్యర్థుల ఎంపికపై గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఇరు పార్టీలూ రెబల్ అభ్యర్థుల సమస్య లేకుండా చూడాలనే ప్రయత్నాలు చేస్తున్నా, కొన్ని చోట్ల తిరుగుబాటు మంటలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది. అంతా చూశాక ఈ ఎన్నికల గర్జనలో ఎవరు ఎంత ఖర్చు పెడతారు..? మనీ ఎలా కదులుతుంది..? అనే దానిపైనే చర్చ నడుస్తోంది. అభ్యర్థుల ప్రచార తీరూ, పార్టీల వ్యూహాలూ, ఉపసంహరణ గడువులో జరగబోయే మార్పులే వచ్చే రోజుల్లో కీలకంగా మారనున్నాయి.
నెగ్గాలంటే ఎంత ఖర్చు చేయాలన్న
దానిపైనే చర్చ
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపిక పూర్తి,
కాంగ్రెస్‌లో గందరగోళం
జనగామ–‘స్టేషన్‌్’లో
మొదలైన రాజకీయ వేడి..
డమ్మీ అభ్యర్థుల నామినేషన్ల
ఉపసంహరణకు పార్టీల
ముమ్మర యత్నాలు
వారెంత? మనమెంత?
వారెంత? మనమెంత?


