ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
పాలకుర్తి టౌన్: మండలంలోని తొర్రూరు గుట్టపై వెలిసిన వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగ వివాహ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేంకటేశ్వర స్వామి కల్యాణం, రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పూజారి రానాచార్యుల నేతృత్వంలో జరిగిన కల్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి మండలంలోని పలు గ్రామాల భక్తులు తరలివచ్చి తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ పసులాది యాకస్వామి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు పసులాది చంద్రయ్య, కార్యదర్శి గోడ రవి,చిలువేరు బాలరాజు, లంక శ్రీనివాస్, పులి శ్రీను, అంజనేయులు, చిలువేరు పెంటయ్య, కొంక మల్లేశం, గోనె సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
గోవర్ధనగిరిలో వైభవంగా ఎడ్లపండుగ
రఘునాథపల్లి: మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో ఆదివారం రైతులు ఎడ్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ పశువులకు స్నానాలు చేయించి, కొమ్ములకు రంగులు అద్ది సుందరంగా అలంకరించారు. అనంతరం పచ్చని పొలాల వద్ద పశువుల గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం రైతులందరూ సహపంక్తి భోజనం చేశారు. రైతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని పండుగకు శోభ తీసుకొచ్చారు. వ్యవసాయానికి ఆధారమైన పశువులపై కృతజ్ఙతాభావంతో ఈ పండుగను ఏటా ఆనవాయితీగా జరుపుకుంటున్నామని రైతులు తెలిపారు.
పుష్కర ప్రయుక్త
మహాకుంభాభిషేకం
జనగామ రూరల్: పట్టణంలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర ప్రయుక్త మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంతో పాటు శత రుద్రాభిషేక హోమం, అన్న ప్రసాద వితరణ, వేద పారాయణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అప్పయ్య శాస్త్రి, దేవస్థానం చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మహంకాళి హరిశ్చంద గుప్తా, ప్రధాన కార్యదర్శి కోకల మల్లేశం, కోశాధికారి అయిత శ్రీనివాసులు, సభ్యులు అల్లాడి ప్రభాకర్, పుల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పులి సంచారంపై అప్రమత్తత
బచ్చన్నపేట: మండలంలోని సాల్వాపూర్, మన్‌సాన్‌పల్లి చుట్టూ పక్కల గ్రామాల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయా గ్రామాల సర్పంచ్‌లు మిద్దెల శ్రీధర్‌గౌడ్, గీస సందీప్ సూచించారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. తమ గ్రామాలతో పాటు పక్క మండలమైన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తోందన్నారు. ఆ మండలంలోని గంధమల్ల అనే గ్రామంలో పులి ఓ రైతుకు చెందిన లేగదూడను చంపివేసిందన్నారు. మన్‌సాన్‌పల్లి, సాల్వాపూర్ గ్రామాల మధ్యన దాదాపు 450 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉన్నదని అందుకే రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. పులి ఉన్న చోట నుంచి దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల మేర తిరుగుతుందని బావుల వద్ద పశువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని, రాత్రి పూట బావుల వద్దకు వెళ్లకూడదన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు పలు సూచనలు చేసినట్లు తెలిపారు.
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం
కేయూ క్యాంపస్: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కృషి అమోఘం అని జైపూర్‌లోని ఎంఎన్‌ఐటీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత లాల్వాని అన్నారు. ఆదివారం కేయూ ఫిజిక్స్ విభాగం, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో లెగసీ ఆఫ్ కల్పనా చావ్లాపై నిర్వహించిన ఆన్‌లైన్ వెబినార్‌లో పాల్గొని ఆమె కీలకపోన్యాసం చేశారు. డాక్టర్ కల్పనా చావ్లా జీవితం భౌతిక శాస్త్రం, అంతరిక్ష పరిశోధన, మహిళా శాస్త్రవేత్తల ప్రేరణకు ప్రతీకగా నిలిచాయని కవిత అన్నారు.
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ఘనంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం


