
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్‌రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందించారు. రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జఫర్‌గడ్, చిల్పూరు, లింగాలఘణపురం మండలాల్లో ఆపరేషన్ విభాగాలను మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎండీ నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నూతన సబ్‌స్టేషన్ల మంజూరీకి కృషి చేస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్
అందించాలి
జనగామరూరల్/పాలకుర్తి టౌన్: ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ.షరీఫ్, ఇప్ప రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాలకుర్తి మండలకేంద్రంలో జరిగిన సమావేశంలో వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. రిటైర్డ్ ఉపాధ్యాయులకు బకాయిపడ్డ బెనిఫిట్స్‌ను చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల సంపాదక వర్గ సభ్యురాలు కళావతి, డీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు చొక్కయ్య, శ్రీనివాసులు, దూడయ్య, యాదయ్య, శివరాం తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం