
పరిష్కారమేది?
వచ్చుడు..
ఇచ్చుడే
జనగామ రూరల్: ఏళ్ల తరబడి సాగులో ఉండగా అక్రమంగా పట్టా చేసుకున్నారని, సదరం సర్టిఫికెట్ ఉన్న ఏళ్ల తరబడి పెన్షన్‌కు ఎదురుచూస్తున్నామని, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇప్పించాలని పలు సమస్యలతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌కు ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్, ఇతర జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ 38 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తూ కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, సమస్యలు పరిష్కారం కావడం లేదని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ..గ్రీవెన్స్‌లో ఇచ్చిన దరఖాస్తులు అధికారులు పరిశీలించి పరిష్కరించాలని అదేశించారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్‌డీఓ వసంత, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తులు ఇలా..
● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన ముక్క రాజయ్య తన తండ్రి పేరుతో ఉన్న భూమి సర్వే నెంబర్ 10/ 79 లోని 1.20 ఎకరం మల్ల భూమిని వారసత్వంగా పట్టా మార్పిడి చేసి ఇవ్వాలని కోరారు.
● బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన తాలిరెడ్డి మధుసూదన్‌రెడ్డి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 202లో పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.10 ఎకరంలో భూమికి రైతుభరోసా అందుతోందని, తన భూమి లేదని, భూమికి హద్దులు చూపించి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
● లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన నడిగోటి సోమయ్యకు చెందిన సర్వే నెంబర్ 263 పట్టా భూమిలో 25 ఎకరాల భూమి ఉందని, 1938లో వర్షపు నీరు చెరువుకు వెళ్లేందుకు నీటిపారుదల శాఖ పంట కాల్వ నిర్మించింది. ప్రస్తుతం శివరాత్రి ఐలయ్య అనే వ్యక్తి దౌర్జన్యంగా కనీలు పాతి వర్షపు నీరు చెరువుకు వెళ్లకుండా అడ్డుకొని పంట కాల్వను పూడ్చి వేయడంతో తన భూమిలో నీరు నిలుస్తున్నదని అధికారులు తగు చర్య తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి అందజేశారు.
● బచ్చన్నపేట మండలం కేసిరెడ్డి పల్లె గ్రామం 380 సర్వే నెంబర్‌లో తాతలు, తండ్రుల నాటి నుంచి వస్తున్న 8 ఎకరాల 18 గంటల భూమి నుండి తమకు ఎటువంటి సమాచారం లేకుండా, సంతకాలు లేకుండా గ్రామానికి చెందిన మరో వ్యక్తి పేరు మీదుగా ఒక ఎకరం రెండు గుంటల భూమిని మార్పిడి చేశారని ఇమ్మడి యాకంరెడ్డి వినతిపత్రం అందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో అడిన సమాధానం చేప్పడం లేదని విచారణ జరిపించి సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
● స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు లేవని, అభివృద్దికి దూరంగా ఉందని కత్తు రాజు వినతిపత్రం అందించారు. ముఖ్యంగా ముక్తుంకుంట కట్ట కింద ఉన్న 500 మీటర్ల మట్టిదారి పూర్తిగా శిథిలావస్థలో ఉందని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
● జఫర్‌గఢ్ మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌సీగా విధులు నిర్వహిస్తున్నానని, కాగా గత మే నెలలతో ఆనారోగ్యంతో నెల రోజులు లీవులో ఉన్నానని, వేతనాలు ఇవ్వాలని సంబంధిత అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని ఎం. రాజమణి వాపోయింది. 5 నెలల నుంచి వేతనాల రాక కుటుంబం గడవక ఇబ్బందులు పడుతున్నామని, తమకు వేతనాలు వచ్చేలా చూడాలని కలెక్టర్‌కు వినతి అందజేశారు.
కేంద్రీయ విద్యాలయం
మంజూరు చేయాలి
జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి పసరవడ్లలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలోని నిరుపేద విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి. విద్యాసంస్థలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయాలి.
–బిర్రు ఇస్తారి, వ్యవస్థాపక అధ్యక్షుడు,
నాగరత్న సేవా సంఘం
కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామంటూ దరఖాస్తుదారుల ఆవేదన
ప్రజావాణిలో 38 దరఖాస్తులు స్వీకరణ
విజ్ఞప్తులను వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

పరిష్కారమేది?