ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం

Oct 14 2025 7:13 AM | Updated on Oct 14 2025 7:13 AM

ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం

ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి చక్రతీర్థం

జఫర్‌గఢ్‌: మండల కేంద్రంలో పడమర కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా సోమవారం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచార్యులు, కృష్ణమాచార్యులు, శ్రీనివాసచార్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా రాత్రి సమయంలో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు.

కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పర్యవేక్షించాలి

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

జనగామ రూరల్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అలాగే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి కార్యక్రమాలుపై అదనపు కలెక్టర్లు పింకేశ్‌ కుమార్‌, బెన్‌ షాలోమ్‌లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా చూడాలన్నారు. సమీక్షలో ఆర్డీఓలు గోపి రామ్‌, డీఎస్‌ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన తప్పనిసరి..

కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)పై అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ హాల్‌లో జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె. మల్లికార్జున్‌రావు ఆధ్వర్యంలో మాస్టర్‌ ట్రైనర్స్‌తో అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..సీపీఆర్‌ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు.

ఎలక్ట్రానిక్‌ కాంటాల పరిశీలన

స్టేషన్‌ఘన్‌పూర్‌: ప్రస్తుత వానాకాలం సీజన్‌కుగానూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందించనున్న ఎలక్ట్రానిక్‌ కాంటాలను స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి ఝాన్సీ సోమవారం తనిఖీ చేశారు. గోదాంలోని కాంటాలను ఒక్కొక్కటిగా 20 కిలోల బాటు తూకం వేసి చెక్‌ చేశారు. సరిగ్గా పనిచేయని వాటిని పక్కకు పెడుతూ సరిగ్గా ఉన్నవాటిని మార్కెట్‌ సిబ్బందిచే సీల్‌ చేయించారు.

జర్నలిజంలో నూతన పాఠ్యప్రణాళికకు ఆమోదం

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్‌ కాలేజీలోని జర్నలిజం విభాగం బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ (బీఓఎస్‌) సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గూగుల్‌మీట్‌లో ఆ విభాగాధిపతి డాక్టర్‌ ఆదిరెడ్డి అధ్యక్షతన వివిధ యూనివర్సిటీల నుంచి పలువురు ప్రొఫెసర్లు పాల్గొని మాట్లాడారు. ఈసమావేశంలో బీఏ జర్నలిజం మొదటి, ద్వితీయ సంవత్సరం సెమిస్టర్లకు సంబంధించి 2025–26 విద్యాసంవత్సరానికి పాఠ్యప్రణాళికను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకత్వంలో సరికొత్త సిలబస్‌ రూపకల్పన చేసి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమకాలీన మీడియా ధోరణులు, కమ్యూనికేషన్‌ టెక్నాలజీలు, జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుని సిలబస్‌ రూపొందించినట్లు జర్నలిజం విభాగాధిపతి ఆర్‌.ఆదిరెడ్డి తెలిపారు.

ఆ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతుల ఉత్తర్వులు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ వివిధ విభాగాల్లో 2010లో నియమితులైన 24మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు కెరీర్‌ అడ్వాన్స్‌మెంటు స్కీం (క్యాస్‌ ) పదోన్నతుల (8000 యాన్యువల్‌ గ్రేడ్‌ పే) ఉత్తర్వులను సోమవారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం జారీచేశారు. త్వరలోనే వీరికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించనున్నారు. వీరు కొంతకాలం క్రితమే దరఖాస్తు కూడా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement