
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
జనగామ: జిల్లాలో సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుని రైతుల సాగుకు ఊతమిచ్చి పంటల ఉత్పత్తిని పెంచేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పలు సమస్యలపై వినతి చేశారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని తరిగొప్పుల మినీ లిఫ్ట్–1 పనులకు సంబంధించిన పైప్‌లైన్ పనులు పూర్తైనప్పటికీ, మరిన్ని చెరువులకు అనుసంధానం చేసే విధంగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అంతే కాకుండా పంపుహౌస్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగు నీటిని అందించాలని మంత్రిని కోరినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగలోపు పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దేవాదుల 8వ ప్యాకేజీలో తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, చేర్యాల(మండల పరిధిలో కాలువలు), కన్నెబోయినగూడెం రిజర్వాయర్ నుంచి బచ్చన్నపేట, జనగామ మండలాల్లో అసంపూర్తిగా ఉన్న కాల్వలను పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. జనగామ నియోజకవర్గంలో 12 చెరువులకు అత్యవసర మరమ్మతులు అవసరం పడ్డాయని, వాటి పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టడానికి నిధులను విడుదల చేయాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ నుంచి తపాస్‌పల్లి గ్రావిటీ కాలువ పనులను పునరుద్ధరించాలని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు. తమ వినతికి సంబంధించి అన్ని పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాగులకు అడ్డంగా చెక్ డ్యాంలతో పాటు చీటకోడూరు రిజర్వాయర్ గేట్లు, పెంబర్తి పెద్ద చెరువు, ఎల్లంల ఏనె చెరువు శాశ్వత పునరుద్ధరణ, జనగామ మండలం పెద్దపహాడ్ పెరుమాండ్ల చెరువు, మరిగడి, తరిగొప్పుల మండలం చింతల చెరువు, అంకుశాపూర్, నాగుల చెరువు, కర్షక కుంట(నర్మెట), బయ్యన్న చెరువు (ఎమర్జెన్సీ రిపేర్) పునరుద్ధరణ పనులకు రూ.7.13 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదన కాపీలను ఎమ్మెల్యే మంత్రికి అందించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ను కోరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి