
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వర్తించాలి
జనగామ రూరల్: ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్‌తో కలిసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నిబంధనలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు వారికి ఇచ్చిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, నిర్వహణ ప్రక్రియలో ఏమైనా సందేహాలు, అపోహలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారిదేనని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్‌కు సంబంధించిన సామగ్రి సమకూర్చడం మొదలగు ప్రతి అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ..మ్యాన్ పవర్, బ్యాలట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, మాడల్ కోడ్ అఫ్ కండక్ట్, బ్యాలెట్ పేపర్ ముద్రణ తదితర ఎన్నికల నిర్వహణ బాధ్యతలను చేపట్టే నోడల్ అధికారులు తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, డీప్యూటీ సీఈవో సరిత, ఎన్నికల నిర్వహణకు వివిధ అంశాలకు కేటాయించిన ఆర్వోలు, ఏఆర్వోలు, మాస్టర్ ట్రైనర్‌లు రామరాజ్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన ఉండాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా