జనగామ: దసరా పండగ రోజు గాంధీ జయంతి రావడంతో ఈనెల 1న (బుధవారం) రాత్రి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలో మాంసం విక్రయాలు జరుగుతాయని ఆరె కటిక సంఘం జనగామ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నిబంధనల ప్రకారం మాంసం దుకాణాలు మూసి ఉంటాయన్నారు. గాంధీ జయంతి రోజు దసరా రావడంతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మటన్ షాపు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దసరా పండుగకు ముందు రోజు అర్ధరాత్రి వరకు మాంసం విక్రయిస్తామన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలన్నారు.
విద్యుత్ అధికారుల పొలంబాట
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
జనగామ: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ టి.వేణుమాధవ్ తెలిపారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న 2,083 లూజ్ లైన్లు, 191 వంగిన స్థంభాలు 2,131 మధ్య స్థంభాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. రైతులు విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైన సమయంలో టోల్ ఫ్రీ నెంబర్–1912కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చన్నారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎస్టిమేట్‌కు సంబంధించిన మెటీరి యల్ వివరాలు, స్కెచ్‌లు ఇప్పుడు తెలుగులో అందజేస్తున్నామని, రైతులకు వచ్చే ఎస్‌ఎంహెచ్ లింక్ ద్వారా వీటిని తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు అమర్చితే మోటార్ల జీవిత కాలం పెరుగుతు ందని, లో వోల్టేజి సమస్యలు తగ్గుతాయని స్పష్టం చేశారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలి
పాలకుర్తి టౌన్: ఎన్నికల ప్రవర్తన నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను పక్కాగా అమలు చేయాలని జిల్లా సహకార అధికారి, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.కోదండరాములు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమలయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. కోడ్‌ను ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎంపీడీవో రవీందర్, ఏంఈఓ పోతుగంటి నర్సయ్య, ఎంపీవో వేణుమాధవ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పసునూరి నవీన్, మాచర్ల ఎల్లయ్య, సారయ్య, ఎడవెల్లి సోమయ్య, జీవై సోమయ్య, కత్తి సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్‌లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు ఘన విజయం సాధించారు. ఫైమా జాతీయ కో–చైర్మన్‌గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచి మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాలకుర్తి టౌన్: పాలకుర్తి–నాంచారిమడూరు ప్రధాన రహదారిపై సిరిసన్నగూడెం శివారులోని కంబాలకుంట బస్‌స్టేజీ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని దర్థేపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి వెంకన్న(35) మోటర్ సైకిల్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు మల్లంపల్లి శివారులోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి డీసీఎం వ్యాన్ బలంగా ఽఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్‌తో పాటు కిందపడ్డ వెంకన్న తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకన్న భార్య పది రోజుల క్రితం ప్రసవించగా కుమారుడు జన్మించాడు. మృతుడి తండ్రి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూలం పవన్‌కుమార్ తెలిపారు.
నేటి రాత్రి 12గంటల వరకే మాంసం అమ్మకాలు