
అన్నింటికన్నా ఆరోగ్యమే మిన్న
బచ్చన్నపేట: అన్నింటికన్నా ఆరోగ్యమే మిన్నా అని అందుకుగానూ గ్రామాల్లోని వీధులను, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్‌కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని సెకండరీ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో 600 మంది విద్యార్థులతో కలిసి శ్రమదానం చేసి మొక్కలను నాటారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతాహీ సేవా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛత పక్షోత్సవాలను చేపడుతూ గ్రామాల్లో పారిశుధ్ధ్యంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతీరోజు పాఠశాలలో విద్యార్థులకు పలు పోటీలను నిర్వహిస్తూ, గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి, మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ రామానుజాచారి, ఎంపీడీఓ మమతాబాయ్, ఎంపీఓ వెంకటమల్లికార్జున్ ,డీసీ ఎస్‌బీఎం కర్ణాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్‌రాజ్, చక్రధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది కలగొద్దు
రైతులకు సరిపడా యూరియా నిల్వలను ఉంచాలని వారికి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాములలో గల యూరియా బస్తాల నిల్వలను పరిశీలించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్ల గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
లింగాలఘణపురం: విద్యార్థులు ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మోడల్ స్కూల్‌లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. అందులోని పరికరాలు, వాటిని వినియోగిస్తున్న తీరును తెలుసుకున్నారు. ప్రిన్సిపా ల్ సునిత, ఎంఈఓ విష్ణుమూర్తి, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు వేగంగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తిచేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై గూగుల్ మీట్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 28,975 ఇందిరమ్మ ఇళ్లు చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 30లోపు నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి వంద శాతం ప్రగతి సాధించాలన్నారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ మాతృనాయక్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సెక్రటరీలు పాల్గొన్నారు.
పదిలో ప్రథమ స్థానంలో నిలవాలి
పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలవాలని, విద్యార్థుల హాజరు 100శాతం నమోదు చేయాలని అలాగే పుస్తకాలు, యూనిఫాం పంపిణీ పూర్తి చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పాఠశాలల ప్రగతిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. దిక్సూచి ప్రోగ్రాంలోని ప్రతీ అంశంపై విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా కృషి చేయాలన్నారు. అక్టోబర్ నుంచి మధ్యాహ్న భోజన పథకం ఆన్‌లైన్ కానున్నదని అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. 19, 20 తేదీల్లో ప్రతి ఎంఈఓ, ప్రధాన ఉపాధ్యాయులు కనీసం మూడు స్కూళ్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఏడీ మూర్తి, ఏఎంఓ శ్రీనివాస్, జిల్లా బాలికల పరిరక్షణ అధికారి గౌసియా బేగమ్, నాగరాజు,శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్‌కుమార్