
యూరియా కోసం రాస్తారోకో
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో ఘన్‌పూర్–పాలకుర్తి రోడ్డుపై యూరియా బస్తాల కోసం రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్ వద్దకు యూరియా స్టాక్ వస్తుందనే సమాచారంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో చేరుకుని క్యూలో నిల్చున్నారు. మధ్యాహ్నం వరకు స్టాక్ రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కాగా మధ్యాహ్న సమయంలో ఆగ్రోస్ సెంటర్‌కు రావాల్సిన 266 బస్తాల లోడ్ గోదాంకు వెళ్తుండగా గుర్తించిన రైతులు వెంటనే యూరియా బస్తాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలో క్యూలో నిల్చున్నా ఒక్క యూరియా బస్తా దొరకడం లేదని, రైతుల సమస్యలు అధికారులు, పాలకులకు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. కాగా విషయం తెలుసుకున్న ఏఓ చంద్రన్‌కుమార్ శివునిపల్లి ఆగ్రోస్ సెంటర్‌కు చేరుకుని రాస్తారోకో చేస్తున్న రైతులకు నచ్చజెప్పారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్యలో రైతులకు యూరియా పంపిణీ చేశారు.