
ప్రజాపాలన దినోత్సవ ముఖ్యఅతిథి బీర్ల
జనగామ: సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ ఆవరణలో జరిగే కార్యక్రమంలో ఉదయం 10 గంటలకు జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ప్రభుత్వ, పట్టణ, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నేడు, రేపు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యలో అమలవుతున్న కార్యక్రమాల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 16, 17వ తేదీల్లో రాష్ట్ర అధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి జనగామ జిల్లాకు రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్ జి.ఉషారాణిని రెండు రోజుల ఆకస్మిక పర్యటనకుగాను పర్యవేక్షణ అధికారిగా నియమించారు. మండల విద్యాశాఖ అధికారితో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి ఉషారాణి 10 పాఠశాలలను తనిఖీ చేయనున్నారు. పాఠశాలల ఎంపికకు సంబంధించి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు.
నేడు జిల్లాకు టీజీడీడీసీఎఫ్ చైర్మన్
జనగామ: జిల్లాలో మంగళవారం(నేడు) తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి పర్యటించనున్నారు. డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి (ఐఏఎస్) తో కలిసి ఆయన జనగామ నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో జరుపతలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి జనగామ విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్‌సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం జనగామ మండలం సిద్ధెంకి గ్రామంలో ఆయన పాల ఉత్పత్తిదారుల కేంద్రాన్ని సందర్శించి, పాడి రైతులతో సమావేశమవుతారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చేనేత సమస్యలను పరిష్కరించండి
జనగామ: చేనేత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు. సొసైటీ ఇన్‌చార్జ్ గుర్రం నాగరాజు ఆధ్వర్యంలో జనగామ మండలం ఎల్లంల, సిద్ధెంకి, పట్టణంలోని బాణాపురం, సంజయ్‌నగర్, వీవర్స్ కాలనీ, బచ్చన్నపేట, లింగాలఘణపురం మండలాల్లోని సిరిపురం, పటేల్ గూడెం నుంచి వచ్చిన సుమారు 2వందల మంది కార్మికులతో ఆర్టీసీ చౌరస్తా నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నాగరాజు నేతృత్వంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. చేనేత భరోసా, చేనేత పెన్షన్లు, స్టాండ్ మగ్గాలు, హెల్త్ కార్డులు తదితర హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత కార్మికులు చిదురాల గణేశ్, ఎనగందుల కృష్ణ, జయరాములు, బిట్ల శంకర్, బిర్రు ఇస్తారి, బిర్రు శ్రీరాములు, మోహన్ కృష్ణ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలి
బచ్చన్నపేట: గ్రామ పంచాయతీల రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని డీఎల్పీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొడవటూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి పలు పనులను యాప్‌లో ఆన్‌లైన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామస్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పైపులైను లీకేజీలు లేకుండా చూడాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలన్నారు. చెత్తను బయట వీధులలో పార వేయకుండా గ్రామస్తులకు అవగాహన కలించాలన్నారు. ఇంటి, నల్లా పన్నులను సకాలంలో గ్రామస్తులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి బృంగి రూపాచైతన్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాపాలన దినోత్సవ ముఖ్యఅతిథి బీర్ల

ప్రజాపాలన దినోత్సవ ముఖ్యఅతిథి బీర్ల