
స్వచ్ఛత ‘అమ్మ’ చేతిలో!
● పాఠశాలల్లో పరిశుభ్రత బాధ్యత
అమ్మ ఆదర్శ కమిటీలకు..
● ప్రత్యేక నిధులు కేటాయించిన
రాష్ట్ర ప్రభుత్వం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణను మెరుగుపరచడమే లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు పరిశుభ్రత బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. పాఠశాలల టాయిలెట్స్ శుభ్రత, మొక్కలకు నీరు పెట్టడం, ప్రాంగణంలో స్వచ్ఛత కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ప్రస్తుతం గ్రామీణ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ, పట్టణ స్కూల్స్‌ను మునిసిపల్ చూసుకోవాల్సి ఉన్నా, అవి సమర్థవంతంగా సాగకపోవడంతో పాఠశాలల పరిశుభ్రతపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే ఈ బాధ్యతలు కట్టబెట్టింది.
స్వచ్ఛత కోసం సర్కారు దృష్టి
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పాఠశాలల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్స్ పేరుతో కొత్త నిధిని ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మోడల్ స్కూళ్లకు వర్తిస్తాయి. టాయిలెట్ల శుభ్రత, మొక్కలకు నీరు పెట్టడం, పాఠశాల ప్రాంగణ సంరక్షణ వంటి ఖర్చులకు మాత్రమే వినియోగించాలి. సమ గ్ర శిక్ష కింద వస్తున్న కాంపోసిటీ స్కూల్ గ్రాంట్‌కు అదనంగా ఈ నిధులు లభిస్తాయి. నిధులు నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఖాతాల్లోకి 10 నెలలపాటు జమ అవుతాయి. జీరో స్కూల్స్‌కు నిధులు కేటాయించబడవు. ప్రత్యేక నిధులతో పాఠశాలల పరిశుభ్రత సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు విద్యార్థులకు స్వచ్ఛమైన వాతావరణం కలిగేందుకు ఆస్కారం ఉంటుందని సర్కారు సంకల్పం.
నిధులు ఇలా
నిధులు డ్రా చేసే సమయంలో ఎవరైనా వ్యక్తి పేరు ప్రస్తావించరాదు. వ్యక్తులకు నేరుగా డబ్బు చెల్లించకూడదు. పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు తరచూ శుభ్రం చేయాలి. శుభ్రపరిచేందుకు అవసరమైన సామగ్రి కొను గోలు చేసే సమయంలో సమగ్ర శిక్ష కింద విడుదలైన కంపోజిట్ స్కూల్ గ్రాంట్ నుంచి వినియోగించాలి. వ్యక్తుల నియామకానికి అయ్యే ఖర్చులను పాఠశాలకు కేటాయించిన మొత్తం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అదనపు నిధులు అనుమతించబడవు. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్స్‌ను జిల్లాల మినరల్ ఫండ్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ)నుంచి విడుదల చేస్తారు. మూడు నెలల ముందుగానే డబ్బులు కమిటీలకు అందజేస్తారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి, విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేలా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంటుంది.
రూ.2.55కోట్లు విడుదల
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష (సివిల్ వర్క్స్) పరిధిలో పాఠశాలల శానిటేషన్‌తో పాటు సదుపాయాల కల్పన, అభివృద్ధి తదితర వాటి కోసం రాష్ట్రంలోని 21 జిల్లాలకు నిధులు కేటాయించగా, జనగామ జిల్లాకు రూ.2.55కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నిధులు పాఠశాలల పరిశుభ్రత, సదుపాయాల మెరుగుదల, మరమ్మతుల కోసం మాత్రమే ఉపయోగించాలి.
విద్యార్థుల నమోదు ఆధారంగా
నెలనెలా నిధులు
1నుంచి 30 మంది వరకు–రూ.3వేలు
31నుంచి 100 వరకు–రూ.6వేలు
101నుంచి 250 వరకు–కూ.8వేలు
251నుంచి 500 వరకు–రూ.12వేలు
501నుంచి750 వరకు–15వేలు
750 పైగా–20వేలు