
సీనియర్ ఉపాధ్యాయులను పరీక్ష రాయమనడం భావ్యం కాదు..
పునఃసమీక్షించాలని ఉపాధ్యాయుల విన్నపాలు
సుప్రీంకోర్టు తీర్పుతో డైలమా
సీనియర్ ఉపాధ్యాయులను పరీక్ష రాయమనడం భావ్యం కాదు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి
జనగామ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ 'టెన్షన్' పట్టుకుంది. ఈనెల 1వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఉలిక్కి పడేలాచేసింది. ఐదేళ్లకు పైబడి సర్వీస్ ఉన్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని తీర్పు స్పష్టం చేస్తోంది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన తర్వాత తమ జీవితాన్ని విద్యారంగానికి అంకితం చేసిన టీచర్లను తక్షణమే పరీక్ష రాయాలని, లేకుంటే ఉద్యోగం కోల్పోవాలనే నిర్ణయం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టెట్ చట్టబద్ధతపై 2010 నోటిఫికేషన్ నేపథ్యం
టెట్ అర్హతపై 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీఈటీ) కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో జారీకి ముందు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2010కు ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులు ఈ పరీక్ష నుంచి తప్పించబడ్డారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగానే గత పదిహేనేళ్లుగా పాలక ప్రభుత్వాలు ఉపాధ్యాయ నియామకాలు చేస్తున్నాయి.
రెండేళ్ల గడువుతో టీచర్లలో ఆందోళన
రెండేళ్లలోపు టీచర్లు టెట్‌లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది సీనియర్లు దశాబ్దాల తరబడి పాఠశాలల్లో బోధన చేస్తున్నారు. ఇప్పుడు వయసు, ఆరోగ్య సమ స్యలు, ఇంటి బాధ్యతలు వంటి కారణాలతో మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి లక్షలాది మంది ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరుకావాల్సి వస్తే నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు.
రివ్యూ పిటిషన్‌కు డిమాండ్
టెట్ అర్హత.. వద్దే వద్దంటూ ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు ఒకే స్వరం వినిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతున్నారు. 2010 నోటిఫికేషన్ కంటే ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపు కొనసాగించాలనే వాదన బలంగా వినపడుతోంది. విద్యారంగంలో అనుభవమే గొప్ప అర్హత అని, సీనియర్ టీచర్ల బోధన నైపుణ్యాలను కేవలం టెట్ పరీక్షతో కొలవలేమనే వాదన ఉంది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సీనియర్ టీచర్ల రక్షణ బాధ్యత ప్రభుత్వాలదే
సీనియర్ టీచర్ల ప్రయోజనాలను కాపాడటం అత్యవసరం. వారు ఇప్పటివరకు నిస్వార్థంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వారికి హఠాత్తుగా పరీక్ష బారిన పడేలా చేయడం సరైన నిర్ణయం కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉపాధ్యాయుల తరఫున నిలబడాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా విద్యహక్కు చట్టం (ఆర్‌టీఈ) అమలు పరంగా ఉపాధ్యాయ నియామకానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, గందరగోళం తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యా నాణ్యతను కాపాడేందుకు నిర్ణయాలు తీసుకోవాలే తప్ప, సీనియర్ ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేయడం తగదని ఉపాధ్యాయ వర్గంలో చర్చ కొనసాగుతోంది.
జిల్లాలో 2,119 మంది టీచర్లు
జిల్లాలో గెజిటెడ్, పీఎస్ హెచ్‌ఎంలతో పాటు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, పండిట్లు, ఇతర కేటగిరీల పరిధిలో 2,119 మంది టీచర్లు ఉన్నారు. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే రెండేళ్ల లోపు సుమారు 850 మంది టీచర్ల వరకు టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.