
స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు
జనగామ: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లలో అధికారుల బృందం గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. లింగనిర్ధారణ చేస్తున్నారా.. నియమ నిబంధనలు పాటిస్తున్నారా..తదితర విషయాలను తెలుసుకునేందుకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు, డీసీపీ రాజమహేంద్రనాయక్ నేతృత్వంలో వైద్య ఆరోగ్య, పోలీసు శాఖ సంయుక్తంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని న్యూవిజయ స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్, జనని స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్, లక్ష్మి స్కానింగ్ సెంటర్, లోటస్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్య స్కానింగ్ సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.
స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ పీసీ, పీఎన్‌డీటీ యాక్టు ప్రకారం అనుమతులు, తదితర రికార్డులను చెక్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో అనుమతి పొందిన రేడియాలజిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అనే దానిపై ఆరా తీశారు. లింగ నిర్ధారణకు సంబంధించి సైన్ బోర్డులు, స్కానింగ్ యంత్రాల వివరాలు, ధరల పట్టిక వివరాలకు స్కానింగ్ సెంటర్లకు వచ్చే వారికి కనిపించే విధంగా ప్రదర్శించారా లేదా అని చూశారు. స్కానింగ్ రేడియాలజిస్ట్, స్కానింగ్ యంత్రాలలో మార్పులు చేర్పులు చేసిన సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో తప్పకుండా నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ప్రతీ నెల 5వ తేదీ లోపు ఫారం ఎఫ్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. స్కానింగ్ సెంటర్‌లలో జరుగుతున్న లోపాలను స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి తగు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో 28 స్కానింగ్ సెంటర్ ఉండగా, మొదటి రోజు 7 చోట్ల తనిఖీలు చేపట్టామన్నారు. తనిఖీల్లో ఏఎస్పీ పండేరీ చేతన్ నితిన్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ కమల్‌హసన్, సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్సైలు బి.రాజేశ్, చెన్నకేశవులు, నరసయ్య తదితరలు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదేశాలు..
మూడు టీములు ఏర్పాటు
లోపాలు ఉన్న సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు