
ఉన్నత స్థానం గురువుదే
జనగామ రూరల్: జీవితంలో ఉన్నత స్థానం గురువుదేనని, విద్యార్థులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి వెలకట్టలేనిదని శాసన మండలి సభ్యుడు(ఎమ్మెల్సీ) పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరెట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. అన్ని స్థాయిలో విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నారు. అదనపు కలెక్టర్, డీఈఓ పింకేశ్ కుమార్ మాట్లాడుతూ..న్యాస్‌లో కలెక్టర్ ప్రత్యేక దృష్టి వల్ల జిల్లా జాతీయస్థాయిలో టాప్ 50లో నిలిచిందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం చేశారు. అలాగే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్, ఏడీ సత్యనారాయణమూర్తి, ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్, గంటా రవీందర్, అధికారులు, ఉపాధ్యాయ యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
శాసన మండలి సభ్యుడు
పింగిలి శ్రీపాల్‌రెడ్డి
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

ఉన్నత స్థానం గురువుదే