
కత్తెరసాగు @ జనగామ
యాసంగి సీజన్ ముగిసిన వెంటనే ప్రారంభం
జనగామ: కత్తెర పంట సాగు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కేవలం జనగామ జిల్లాలో మాత్రమే సాగు చేసే ఈ విధానంతో రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. సాధారణంగా వానాకాలంలోనే వరి సాగు ప్రారంభించి, యాసంగి వరకూ రెండు పంటలకే రైతులు పరిమితమవుతారు. కానీ జనగామ ప్రాంతంలో మెజార్టీ రైతులు మాత్రం తమ సొంత పద్ధతిలో ముందుగానే వరి విత్తనాలు వేసి, సెప్టెంబర్ మొదటి వారంలోనే కోతలు ప్రారంభిస్తారు. దీనిని స్థానికంగా ‘కత్తెర పంట’ గా పిలుస్తారు.
జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో రైతులు వర్షాకాలం సమీపం వేసవి కాలం చివరలో మూడో పంటగా వరి కత్తెర సాగును ప్రారంభిస్తారు. జూన్ నెలాఖరులో నేలలో తేమ, తక్కువ వర్షపాతంలాంటి పరిస్థితులను వినియోగించుకుని దుక్కులు దున్ని నార్లు పోసి, నాట్లు వేయడం వల్ల ఆగస్టు చివరి నాటికి పంట చివరి దశకు వచ్చి, సెప్టెంబర్ మొదటి వారంలో కోతలు పూర్తవుతాయి. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల వరకు వరి సాగు చేయగా, ఇందులో కత్తెర సాగు 40 వేల ఎకరాలకుపైగా నమోదవుతుంది. కత్తెర పంట సాగు ఒక విశిష్టతగా ఇక్కడి రైతులు భావిస్తారు. ఈ సాగు విధానం కొత్తగా ఆవిర్భవించిన పద్ధతి కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని ఇక్కడి రైతులు చెబుతున్నారు. పూర్వం నుంచి రైతులు ఈ పద్ధతిని అనుసరించడంతో ఇప్పుడు అది ఒక ప్రత్యేక సంప్రదాయంగా మారిపోయింది. వానాకాలం పంటల కంటే ముందే కత్తెర పంట రావడం వల్ల పలువురు రైతులు మూడో పంటలు పండించే అవకాశం పొందుతున్నారు.
రెండు పంటల మధ్య కత్తెర పంట
యాసంగి, వానాకాలం మధ్య ఈ కత్తెర పంట రైతులకు అదనపు ఆదాయంగా దోహదపడుతుంది. వా నాకాలంలో సహచర రైతులు నాట్లు వేస్తున్న సమయంలో కత్తెర రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యం అమ్మకానికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ సమయంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్‌గా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంతే కాకుండా వర్షాకాలం పంట కోత పూర్తయ్యేలోపు కొత్త విత్తనాల కోసం మళ్లీ నేల సిద్ధం చేసుకునే సమయం కూడా రైతులకు దొరుకుతుంది. ఇది రైతులకు ఒకవైపు సంప్రదాయం, మరోవైపు ఆర్థిక భరోసాగా చెప్పవచ్చు.
కత్తెర పంట సాగు కోతలు, అమ్మకం సమయంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండవు. కత్తెర పంట ధాన్యాన్ని జనగామ వ్యవసాయ మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 8వ తేదీ నుంచి కత్తెర పంట ధాన్యం వస్తుంది. ధాన్యంలో తేమ 30 నుంచి 42 వరకు ఉండడంతో క్వింటాకు రూ.1,750 నుంచి రూ.1,850 వరకు మాత్రమే పలుకుతుంది. 2025–26 నుంచి కేంద్రం వరి పంటకు మద్దతు ధర ఏ గ్రేడ్ రూ.2,389, సాధారణం రూ.2,369కి పెంచింది. ఈ లెక్కన రైతులు ప్రైవేట్‌లో అమ్ముకోవడంతో నష్టపోవాల్సి వస్తుంది.
మూడో పంటగా అదనపు దిగుబడి
దశాబ్దాలుగా ఆనవాయితీ

కత్తెరసాగు @ జనగామ