
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
నర్మెట: మౌలిక వసతుల కల్పనలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని, పంచాయతీలు వంద శాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచా యతీ అధికారి నాగపురి స్వరూపరాణి అన్నా రు. మచ్చుపహాడ్ గ్రామ పంచాయతీని మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆమె రికార్డులను పరిశీలించడంతోపాటు గ్రీవెన్స్‌కు అందిన దరఖాస్తుపై క్షేత్రస్థాయి పరిశీంచి సమస్య పరిష్కరించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యే క దృష్టి సారించడంతోపాటు తాగునీటి ట్యాంకులను సకాలంలో క్లోరినేషన్ చేయాలని చెప్పారు. సిబ్బంది రోజువారీ పనుల రికార్లును పారదర్శకంగా నిర్వహించాలని ఈసందర్భంగా ఆమె సూచించారు. ఆమె వెంట కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి దామెర వంశి, కారోబార్ లింగాల రమేష్, సిబ్బంది ఉన్నారు.
నేడు కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి
జనగామ రూరల్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, రజక కులస్తులు ఇతర కులసంఘ నాయకులు, జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
చెట్ల తొలగింపునకు వేలం
జనగామ రూరల్: పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చెట్ల తొలగింపునకు ఆసక్తిగల అభ్యర్థులు బహిరంగ వేలంలో పాల్గొనాలని జిల్లా అటవీ క్షేత్ర అధికారి కొండల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల పాఠశాలలో 132 చెట్లు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఈనెల 12వ తేదీన ఉదయం 11:30 గంటలకు గురుకుల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే బహిరంగ వేలంలో పాల్గొనాలని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ముందుగా రూ.10వేలు ఈఎండీ జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
జనగామ రూరల్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గుంటుపల్లి కార్తీక్ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పైతరగతులకు వెళ్లాలంటే విద్యార్థులకు కళాశాల యజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడంలేదని తెలిపారు. విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేందర్, వంశీ, సాయి చరణ్, రాహుల్ దుర్గ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

వంద శాతం పన్నులు వసూలు చేయాలి