
అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవు
● డీఎంహెచ్‌ఓ మల్లికార్జునరావు
స్టేషన్‌ఘన్‌పూర్: అర్హత లేకుండా నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వైద్యం చేస్తే తగిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని పలువురు ఆర్‌ఎంపీలు నిర్వహించే క్లినిక్‌లు, మెడికల్‌షాపులు, ఆప్టికల్స్‌ను డిప్యూటీ డీహెచ్‌ఎంఓ సుధీర్‌తో కలిసి ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో ఆర్‌ఎంపీలు నిర్వహించే క్లినిక్‌లు, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆప్టికల్స్, అర్హత లేని వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న మెడికల్ షాపులు, క్లినిక్‌లను వారు తనిఖీలు చేపట్టారు. ఆయా క్లినిక్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వారు చేస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ మేరకు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంపత్, సదానందం క్లినిక్‌లతోపాటు రెండు ఆప్టికల్ట్ షాపులను వారు సీజ్ చేశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లిలో తనిఖీలు నిర్వహించారన్నారు. మెడికల్ కౌన్సిల్ నివేదిక మేరకు మేరకు తాము శివునిపల్లిలో తనిఖీలు చేపట్టామన్నారు. కనీసం ప్రాథమిక వైద్య చికిత్సలు చేసే అర్హత లేనివారు ఇక్కడ ఆర్‌ఎంపీ వైద్యులుగా చెలామణి అవుతున్నారని, అందుకే వారి క్లినిక్‌లను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా ఆప్టికల్స్ షాపుల పేరిట అర్హత లేనివారు వైద్యం చేస్తుండగా రెండు ఆప్టికల్స్ షాపులను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా డయాగ్నిస్టిక్ సెంటర్లు, మెడికల్ షాపుల వారికి నోటీసులు జారీ చేశామని, వారు అందించే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. సీజ్ చేసిన వారు తిరిగి వైద్యం చేస్తే చట్టపరంగా కేసులు పెట్టి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. ఆయన వెంట సీహెచ్‌ఓ మల్లికార్జున్, వైద్య సిబ్బంది ఉన్నారు.