
వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి
దేవరుప్పుల: వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవానికి సమష్టిగా కృషి చేద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై మౌలిక వసతుల కోసం ఇటీవల మంజూరైన రూ.కోటి వినియోగంపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో ఆలయ ప్రాంగణం పునరుద్దరణ, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీరు, స్నానపు గదుల సదుపాయాలు, పార్కింగ్ స్థలాల వంటి వసతులను కల్పించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించకుండా నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలన్నారు. ప్రణాళిక మేరకు సత్వరమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు. వచ్చే జాతర నాటికి వానకొండయ్య గుట్ట రూపురేఖలు మార్చి పుణ్యక్షేత్రంగా వర్దిల్లేలా అనుబంధ శాఖలు, ప్రజాప్రతినిధులం కలిసి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. తొలుత గుట్టపై ఆలయంలో మూలవిరాట్‌కు ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకొని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆడెపు ఆండాలు, ఎంపీడీఓ సురేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు అరుణ, దివ్య, మానస, సింధుప్రియ, ఆలయ పూజారి బీట్కూరు సంపత్ కుమారచార్యులు తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి