
‘చేనేత’ ఆదాయం పెంచడమే లక్ష్యం
లింగాలఘణపురం: చేనేత కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా చీరలపై నూతన డిజైన్ల కోసం రెండు నెలల శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, జెన్‌ప్యాక్ ఇండియా సీఎస్‌ఆర్ సహకారంతో జీ సఖి – ఇక్కత్ వీవర్స్ ప్రాజెక్టులో చేనేత మహిళ ప్రావీణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జనగామ ప్రాంతంలో గతంలోని డిజైన్లు మినహా కొత్త రకాలపై అవగాహన లేదన్నారు. కొత్త డిజైన్లు, మగ్గానికి ముందు చేపట్టే పని భారాన్ని తగ్గించి ఆదాయం పెంచడమే ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. శిక్షణను వినియోగించుకోవాలని హ్యాండ్‌లూమ్ ఏడీ చౌడేశ్వరి కోరారు. ఈ సందర్భంగా నూతన డిజైన్ల శిక్షణలో కావాల్సిన గ్రాఫ్ బుక్స్‌ను సంస్థల ప్రతినిధులు ఆవిష్కరించి చేనేత మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో జెన్‌ప్యాక్ ఇండియా ప్రతినిధి అపర్ణ పాథక్, సుమన్, విగ్నేష్, రాధాకృష్ణ, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీనియర్ మేనేజర్ మేరుగు భరత్, శివపార్వతి, బ్రిగేడియర్ రిటైర్డ్ గణేశం, కొత్తపల్లి చేనేత సొసైటీ చైర్మన్ నాగభూషణం పాల్గొన్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం