
కాళోజీ సేవలు చిరస్మరణీయం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: తెలంగాణ యాసలో సామాజిక రచనలు చేసి ప్రజలను చైతన్యపర్చిన ప్రజాకవి, సామాజిక ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ష లోమ్‌తో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లుర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ మాండలికంలో సామాజిక రచనలు చేస్తూ తెలంగాణ ప్రజలను సామాజికంగా మేల్కొల్పిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదుతో గౌరవించిందని తెలిపారు. ఆయన పుట్టిన రోజును రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అధికారికంగా కాళోజీ జయంతి నిర్వహిస్తోందని వివరించారు. భావితరాలకు ఆయన స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.