
పెసర్ల కొనుగోలులో సిండికేట్
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్‌లో పెసర్ల ధరలు మళ్లీ తగ్గాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిండికేట్ బేరం నడిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెసర్లకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,360 ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా పెసరు పంట ధరలు సగానికి పైగా తగ్గగా, సాక్షి వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. అయినప్పటికీ మార్కెట్‌లో ధరలు మాత్రం పెరగడం లేదు. గురువారం దేవరుప్పుల మండలం పెద్దమడూరుకు చెందిన రైతు బోరెం నరేందర్‌రెడ్డి ఐదున్నర క్వింటాళ్ల పెసర్లను అమ్ముకునేందుకు జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు 50శాతం మాత్రమే గిట్టుబాటు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన ధర రాక పెట్టుబడులు కూడా రావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వ్యాపారులు ఒక్కటై ధర రాకుండా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో పెసర్లు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదని దీంతో ధర తగ్గుముఖం పడుతోందని మండిపడ్డారు.
భారీగా తగ్గిన ధరలు
పెట్టుబడి కూడా రావడం లేదంటూ రైతుల ఆవేదన

పెసర్ల కొనుగోలులో సిండికేట్