
చేపల టెండర్లలో సంక్షోభం!
రెండేళ్ల బిల్లులు
రూ.3.93కోట్లు పెండింగ్
1.43 కోట్ల చేప పిల్లలకు టెండర్లు
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా చేపల టెండర్ల ప్రక్రియ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రతీ సంవత్సరం వర్షాలతో రిజర్వాయర్లు, చెరువుల్లో 50 శాతం నీరు చేరిన వెంటనే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య చేపల విత్తనం (ఫిష్ సీడ్స్) వేయడం ఆనవాయితీ. ఈసారి టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మత్స్యకారుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. ఈ నెల 1వ తేదీన చేప పిల్లల పంపిణీకి టెండర్లు ఉండగా, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం 8వ తేదీ వరకు గడువు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరంలో చేపల విత్తనం సరఫరా చేసిన కాంట్రాక్టర్లలకు ప్రభుత్వం బిల్లులును చెల్లించకపోవడంతో పరిస్థితి సంక్లిష్టమైంది. ఈ రెండేళ్ల పరిధిలో కాంట్రాక్టర్లలకు ప్రభుత్వం నుంచి రూ.3.93 కోట్ల మేర రావాల్సి ఉంది. 2024–25 సంవత్సరంలో చేప పిల్లల టెండరు ప్రక్రియ నిర్వహించే సమయంలో ఇదే పరిస్థితి నెలకొంది. మునుపటి బిల్లులను మంజూరీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ప్రభుత్వం 50శాతం చేప పి ల్లలకు మాత్రమే టెండరు ప్రక్రియ నిర్వహించగా, జిల్లాలో 1.29 కోట్ల పిల్లలకు గాను రూ.1.33 కోట్ల మేర బడ్జెట్ కేటాయించారు. కాంట్రాక్టర్లు ఈ మొత్తంగా చేపపిల్లలను పంపిణీ చేయగా, సర్కారు నుంచి ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. రెండు సంవత్సరాల బిల్లులు పెండింగ్‌లో ఉండటమే కాకుండా, చెల్లింపులపై ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంట్రాక్టర్లు, ప్రభుత్వం మధ్య సందిగ్ధత నెలకొంది. దీంతో కొత్త టెండర్లలో పాల్గొనే ఉత్సాహం గుత్తేదారులలో కనిపించడంలేదు.
ఈనెల 1వ తేదీన ప్రభుత్వం ఆన్‌లైన్ పద్ధతిలో చేపల టెండర్ల ప్రక్రియ నిర్వహించగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. చివరి అవకాశం కింద ఈనెల 8 వరకు గడువు పెంచింది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. రెండవ దఫాలోనైనా వస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది మత్స్యకారులు రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల వేటపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం విత్తనం వేయకపోతే రాబోయే రెండు మూడు సంవత్సరాలకు కూడా చేపల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది కేవలం ఈ ఏడాది ఆదాయం మాత్రమే కాదు, భవిష్యత్‌లోనూ మత్స్యకారుల ఆర్థిక స్థితిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టర్ల ప్రధాన డిమాండ్ గత రెండేళ్ల బిల్లులను క్లియర్ చేసి, భవిష్యత్‌లో చెల్లింపులు ఆలస్యం కాకుండా నిబంధనలను సడలించాలనే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్కారు వద్ద ఆర్థిక భారం పెరిగి పోతుండడంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుంది. దీంతో చాలా చోట్ల మత్స్య కార్మికులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, రిజర్వాయర్లలో వేసుకునే దయనీయ పరిస్థితి నెలకొంది.
ముందుకురాని కాంట్రాక్టర్లు
ఈ నెల 8వ తేదీ వరకు మరో అవకాశం
ఆగమ్యగోచరంగా మత్స్యకారుల భవిష్యత్
ఈ ఏడాది 1.43 కోట్ల చేపపిల్లల
పంపిణీకి టెండర్లు
జిల్లాలో 2025–26 వార్షిక సంవత్సరంలో చేప పిల్లల పంపిణీకి టెండర్లకు ఆహ్వానించారు. 80 నుంచి 100, 35 నుంచి 40 ఎంఎం సైజులో ఉన్న 1.43 కోట్ల (కట్ల, రోగు, బంగారు తీగ) రకాల చేప పిల్లలకు సంబంధించి ఈ సారి రూ.3.19 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. జిల్లాలో 9 రిజర్వాయర్లు, 727 చెరువులు ఉన్నాయి. గత బిల్లుల పెండింగ్‌తో గుత్తేదారులు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈనెల 8 చివరి గడువు ముగిసేలోపు ప్రభుత్వం, గుత్తేదారుల మధ్య రాజీ కుదరకపోతే ఈ సంవత్సరం చేపల విత్తనం వేయడం కష్టసాధ్యం అవుతుంది.

చేపల టెండర్లలో సంక్షోభం!