
‘చాట్‌బాట్’తో మెరుగైన సేవలు
జనగామ: వినియోగదారుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొచ్చే క్రమంలో తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎన్పీడీసీఎల్) వినూత్న ప్రయత్నం చేసింది. ఇకపై వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సేవలను ‘వాట్సాప్ చాట్‌బాట్’ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. వినియోగదారుడు తన స్మార్ట్ ఫోన్ వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు ‘హాయ్’ అని పంపించిన వెంటనే వెల్ కం టు టీజీఎన్పీడీసీఎల్ కాల్‌సెంటర్ అని సందేశం వస్తుంది. దీంతో పాటు కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
ఫిర్యాదు నమోదు ఇలా..
వినియోగదారు ‘వాట్సాప్ చాట్‌బాట్’ లో యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే సర్వీస్ వివరాలు ప్రదర్శించబడతాయి. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు నిర్ధారించిన తర్వాత సమస్యకు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుంది. ఇందులో సమస్యను ఎంపిక చేసుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అందులో నేరుగా చాట్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫిర్యాదు నమోదైన వెంటనే ప్రత్యేక కంప్లైంట్ ఐడీ ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది. వినియోగదారులు తమ ఫిర్యాదు ఐడీ ద్వారా సమస్య పరిష్కారం ఎక్కడి వరకు వచ్చిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్య పరిష్కారం జరిగిన వెంటనే సదరు వినియోగదారుడికి ఐవీఆర్‌ఎస్ కాల్ కూడా వస్తుంది. ఇందులో సేవలు ఎలా ఉన్నాయనే దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. వినియోగదారుడు సంతృప్తి చెందక పోతే ఫిర్యాదును తిరిగి రీఓపెన్ చేసుకునే అవకాశం కల్పించారు. అదనపు సదుపాయాలు టీజీఎన్పీడీసీఎల్ అధికారిక వెబ్‌సైట్ టీజీ ఎన్పీడీసీఎల్.కామ్‌లో వాట్సాప్ ఐకాన్ సేవలను సైతం అందుబాటులో ఉంచారు. అంతే కాకుండా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కూడా కాల్ చేయవచ్చు.
విద్యుత్‌శాఖలో వాట్సాప్ సేవలు
ఇకపై ఇందులోనే ఫిర్యాదులు, పరిష్కారం చూసుకునే అవకాశం
7901628348 నంబర్‌కు
‘హాయ్’ అని పంపితే చాలు..