
పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?
జనగామ రూరల్: తమకు అన్యాయం జరిగినా నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం లేదని ఓ బాధితురాలు..కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలని ఓ పేదమహిళ.. రెండో విడత ఇందిరమ్మ బిల్లు రావడం లేదని ఓ లబ్ధిదారు, ఆరు నెలల నుంచి వేతనాలు లేక అవస్థలు పడుతున్నామని ఓ చిరుద్యోగి..ఇలా పలు సమస్యలతో సోమవారం ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌కు తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రజల నుంచి 69 వినతులను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్షాలోమ్, జిల్లా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి ఖర్చులు పెట్టుకుని ఏళ్లతరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు వాపోయారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆయా శాఖల అధికారులు నిషితంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● నర్మెట మండల కేంద్రానికి చెందిన దేవర ధ్రువిత్‌రెడ్డి తన దరఖాస్తు అందిస్తూ తన తల్లి చనిపోయిందని, తండ్రి పట్టించుకోవడం లేదని తనకు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ గురుకులం లో సీటు ఇప్పించగలరని వినతిపత్రం అందజేశాడు.
● రఘునాథపల్లి మండలం కన్నాయిపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుమార్తె జస్విక.. తాను ఆత్మకూరు సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నానని పాలకుర్తిలో గాని, నర్మెటలో గాని గురుకులంలో సీటు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
● జనగామ పట్టణానికి చెందిన సంఘ వెంకటేశ్ తన దరఖాస్తు అందిస్తూ తన ఇంటి చుట్టూ నీరు నిలుస్తున్నందున ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యను పరిష్కరించాల్సిందిగా దరఖాస్తు అందించారు.
● తరిగొప్పుల మండలంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన పుష్ప..తన భర్త కృష్ణయ్య మరణించాడని నలుగురు కుమార్తెలతో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కూలి పనులపై ఆధారపడి జీవిస్తున్నందున తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
నిందితులపై కేసుపెట్టడం లేదు
గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు 2019లో తనను అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించారు. అప్పటినుంచి న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని పోలీసులను కోరినా పట్టించుకోవడం లేదు. తనకు తల్లిదండ్రులు, తోబుట్టువు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్లిన న్యాయం జరగడం లేదు.
– కోసంగి ఉపేంద్ర,
రామరాజుపల్లి, దేవరుప్పుల మండలం
రెండో విడత బిల్లుకు ఇబ్బందులు
ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభించినప్పుడు మొదటి విడత బిల్లు వచ్చింది. అయితే సజ్జల లెవల్‌కు రాగా రెండో విడత బిల్లుకు ఫొటో అప్‌లోడ్ కావడం లేదని అధికారులను అడగగా ఉప్పల్‌లో ఇల్లు ఉందని అందుకే బిల్లు రావడం లేదని అంటున్నారు. తమకు ఎక్కడ ఇల్లు లేదని హైదరాబాద్‌కు, కలెక్టరేట్‌కు అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. ఇల్లు లే కున్నా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోందని, విచారణ చేపట్టి తమకు ఇందిరమ్మ బిల్లు వచ్చేలా చూడాలి.
–కోసున రాంచంద్రరెడ్డి,
గోపాలపురం, పాలకుర్తి మండలం
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి
గ్రామంలో ఎలాంటి ఆస్తులు లేవు. ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం హైదరాబాద్‌లో కూలీ పనులు చే సుకుంటు బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఇంతవరకు అనుమతి పత్రాలు ఇవ్వడం లేదు.
– మిద్దేపాక సునీత,
పసరమడ్ల, జనగామ మండలం
ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
గ్రీవెన్స్‌లో దరఖాస్తులు చేస్తున్నా
పట్టింపులేదు..
ప్రజావాణిలో బాధితుల గోడు
వినతులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
పట్టా కావడం లేదు
గ్రామంలో సర్వే నెంబర్ 191లో ఎకరం 36 గుంటల భూమి నా పేరిట ఉంది. గత ప్రభుత్వంలో పట్టాపాస్ బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నా. అధికారులు ఇప్పటివరకు పట్టా పాస్ బుక్ ఇవ్వడం లేదు. భూభారతిలో దరఖాస్తు చేసుకున్న ఎలాంటి సమాధానం లేదు. సర్వే చేపట్టి పట్టా పాస్ బుక్ మంజూరు చేయాలి.
–బొట్ల బాబు, యశ్వంతాపూర్,
జనగామ మండలం
అంత్యోదయ కార్డు ఇచ్చి ఆదుకోవాలి
నాపేరు ఖమ్మం శ్రీకాంత్. మాది స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. పుట్టుకతోనే నాకు కళ్లు కనబడవు. వివాహమై 5 ఏళ్లు అవుతోంది. పింఛన్‌తో, భార్య కూలీ పనులతో కాలం వెల్లదీస్తున్నాం. తల్లిదండ్రుల రేషన్‌కార్డులో పేరు ఉంది. దివ్యాంగుడి కోటా కింద నాకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా. నాకు కొత్త కార్డు మంజూరు చేయండి.
ఆరు నెలలుగా వేతనాలు లేవు
తెలంగాణ మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, పీడీ, కంప్యూటర్ ఆపరేటర్స్, నైట్ వాచ్‌మెన్, అటెండర్‌లకు ఆరు నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో జీవనోపాధి కష్టంగా మారింది. ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సిన వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి.

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?

పరిష్కారానికి ఇంకెన్నాళ్లు?