వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలి
● వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
జనగామ రూరల్: వరద నష్టనివారణ చర్యలు చేపట్టాలని, శాఖల పరంగా పనులు గుర్తించి నివేదికలు రూపొందించుకోవాలని, పనులు, కావాల్సిన నిధులను తెలియజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ధనసరి అనసూయ(సీతక్క) తదితర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌లతో భారీ వర్షాలతో జరిగిన నష్టం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్లు బెన్షా లోమ్, పింకేశ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..జిల్లాలో భారీ వర్షాల వల్ల కలిగిన నష్టంపై అంచనాలు రూపొందించి తక్షణమే నివేదికలు అందజేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, జిల్లా అధికారులు, నీటిపారుదల, ఇంజనీరింగ్, వైద్య, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన వన, పంచాయతీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సర్వేయర్లకు
ధ్రువీకరణ పత్రాల పంపిణీ
జనగామ రూరల్: జిల్లా వ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న 48 మంది సర్వేయర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సర్వేయర్‌గా శిక్షణ పొంది అర్హత సాధించిన సర్వేయర్లకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఏఓ శ్రీకాంత్, సర్వే శాఖ ఏడీ మన్యం కొండ పాల్గొన్నారు.


