
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
చిల్పూరు: హై టెన్షన్ విద్యుత్ వైర్లను పోల్‌లపై గుంజుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వలస కూలీ అర్షద్ అలీ (25) మృతి చెందిన సంఘటన సోమవారం వెంకటేశ్వరపల్లె గ్రామ సమీపంలో జరిగింది. సూపర్ వైజర్ రాజేశ్ అందించిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరపల్లి నుంచి మల్లికుదుర్ల వరకు హైటెన్షన్ విద్యుత్ లైన్ వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు విద్యుత్ పోల్‌లను ఎక్కి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో బుగులాబాద్‌కు చెందిన అర్షద్ అలీ మధ్యాహ్న సమయంలో పనులు చేస్తుండగా పక్కనే ఉన్న మరో లైన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై పోల్ పైనే మృతి చెందాడు. వెంటనే పొక్లెయినర్ సాయంతో కిందికి దించారు. అదే సమయంలో జఫర్‌గఢ్ మండల కేంద్రానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య విషయం తెలుసుకుని సీపీఆర్ చేయగా అప్పటికే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.